వివేకా హత్య…ఎవరి కుట్ర!?

 

కాదేదీ రాజకీయానికి అనర్హం అన్నట్లు తయారయింది రాష్ట్రంలో పరిస్థితి. వైఎస్ రాజశేఖర రెడ్డి సోదరుడు వివేకానంద రెడ్డి దారుణ హత్యపై అధికారపక్షం, ప్రధాన ప్రతిపక్షం పరస్పర విమర్శలతో వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. ఎన్నికల  ముందు సంభవించిన ఈ పరిణామం సాధారణ ప్రజలను దిగ్భ్రాంతికి గురి చెయ్యగా, రాజకీయ కుట్రే వివేకా హత్యకు కారణమన్న నేతల ఆరోపణలతో రాజకీయ పరిస్థితి మాత్రం గందరగోళంగా తయారయింది.

చంద్రబాబు, లోకేష్ హత్యకు బాధ్యత వహించాలనీ, సిబిఐకి కేసు అప్పగించాలనీ వైసిపి అంటున్నది. అగ్ర నాయకత్వం సహకారంతో మంత్రి ఆదినారాయణ రెడ్డి హత్య చేయించారని వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఆరోపించారు. వైఎస్ రాజారెడ్డి హంతకుడిని ముందే విడుదల చేయించి టిడిపి కార్యాలయంలో ఆశ్రయం కల్పించారని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వివేకా మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసారు. వైఎస్ జగన్ ఇంకా స్పందించలేదు. ఆయన సాయంత్రానికి పులివెందుల చేరుకుని బాబయికి నివాళులు అర్పించారు.

ఒక పక్క వివేకా మృతదేహానికి ఇంకా పోస్టుమార్టం కూడా జరగకముందే, టిడిపి నాయకులే వివేకాను హత్య చేయించారన్న ఆరోపణ వైసిపి వైపు నుంచి రావడంతో అధికారపక్షం నాయకులు రెచ్చిపోయారు.
ప్రభుత్వ విప్ బుద్దా వెంకన్న అమరావతిలో మాట్లాడుతూ ఏకంగా వైసిపి అధినేత వైఎస్ జగన్‌పైనే బాణం ఎక్కుపెట్టారు. సలహాదారు ప్రశాంత్ కిషోర్ సలహాతో జగన్ బాబాయిని హత్య చేయించారని ఆయన ఆరోపించారు. ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన విధించేట్లు చేయడం ఈ వ్యూహం లక్ష్యమని ఆయన అన్నారు.

గత ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి మరణాన్ని జగన్ ఎన్నికల్లో వాడుకున్నారనీ, ఈ ఎన్నికల్లో బాబాయి వివేకా మరణాన్ని వాడుకుంటారనీ మరో టిడిపి నేత లింగారెడ్డి వ్యాఖ్యానించారు. తనపై వచ్చిన ఆరోపణలను మంత్రి ఆదినారాయణ రెడ్డి తీవ్రంగా ఖండించారు.