టెన్షన్ పెడుతున్న ‘బుల్ బుల్’!

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

బంగాళాఖాతంలో ‘బుల్‌‌బుల్‌‌’ తుఫాను విజృభిస్తోంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ‘బుల్‌బుల్‌’ తీవ్ర తుఫానుగా మారినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. పెను తుఫానుగా మారిన ‘బుల్ బుల్’ తెలుగు రాష్ట్రాలపై కూడా ప్రభావం చూపుతోంది. ఈ తుఫాను పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ వైపు పయనిస్తున్నప్పటికీ, ఒడిశా, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ బెంగాల్‌కు 740 కి.మీ దూరంలో ఈ తుఫాను కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో ఇప్పటికే తీర ప్రాంత రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయని, దీని ప్రభావం మరో 72 గంటల వరకూ ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, బెంగాల్ తీరంలో గంటకు 100 కిలోమీటర్ల వరకూ వేగంతో గాలులు వీస్తున్నాయని తెలిపారు.

ఏపీలోని ఉత్తరాంధ్ర ప్రాంతంలో బుల్ బుల్ ప్రభావం అధికంగా ఉందని విశాఖపట్నం వాతావరణ హెచ్చరికల కేంద్రం పేర్కొంది. శనివారం పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో ఇది తీరాన్ని దాటవచ్చని అంచనా వేస్తున్నట్టు వెల్లడించింది. తుపాను తన దిశను మార్చుకునే అవకాశాలు కూడా ఉన్నాయని, ఇది ఒడిశా వైపు పయనిస్తే, చాలా ప్రాంతాల్లో కుంభవృష్టి కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఒడిసా తీరం వెంబడి గంటకు 120 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. ఇది గంటకు 145 కిలోమీటర్ల వరకు పెరగొచ్చని పేర్కొంది. దీంతో ఒడిసా ప్రభుత్వం జిల్లా కలెక్టర్లు, ప్రధానంగా తీర ప్రాంతంలోని అధికారులను అప్రమత్తం చేసింది. బుల్‌బుల్‌ తుఫానును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ప్రభావిత రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొంది.

ఈ  ‘బుల్‌ బుల్‌’ తుఫాను కారణంగా ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని వావరణశాఖ హెచ్చరికలతో ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. ‘బుల్‌ బుల్‌’ తుఫాను ప్రభావం కోస్తాపై వుండే అవకాశం వుండటంతో అన్ని ప్రధాన పోర్ట్ లను అప్రమత్తం చేశారు. తుపాన్‌ ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని.. మత్స్యకారులు వేటకు వెళ్లద్దని అధికారులు హెచ్చరించారు. తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెప్పారు.

ఏపీలో ఇప్పటికే ఇసుక కొరత వల్ల ఇబ్బందులు పడుతుంటే.. ఈ బుల్ బుల్ తో మరిన్ని ఇబ్బందులు తలెత్తేలా కనిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఎగువన వర్షాలు కురవడంతో ఏపీలోని ప్రధాన నదులకు వరదలు పోటెత్తింది. ఈ వరద కారణంగా ఇసుక తవ్వకాలు ఆగిపోయాయి. మరోవారం రోజుల్లో వరద ఉదృతి తగ్గుతుందని, అప్పుడు ఇసుక తవ్వకాలను జరపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాష్ట్రంలో ఇసుక కొరత కారణంగా నిర్మాణ రంగం కుదేలైన సంగతి తెలిసిందే. దీనిపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. మరోవారంలో అన్ని సర్దుకుంటాయిలే అనుకుంటున్న సమయంలో ‘బుల్‌ బుల్‌’ రూపంలో ఏపీకి మరో ముప్పు ఏర్పడింది.