చంద్రబాబును చూస్తే దగ్గుబాటికి జాలి అట!

చంద్రబాబును చూస్తే తనకు జాలి తప్ప అసూయ లేదని ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. బుధవారం వైసిపి తీర్ధం తీసుకోనున్న సందర్భంగా కుమారుడు హితేష్‌తో కలిసి ఆయన మంగళవారం విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.

నా తోడల్లుడు చంద్రబాబు సృష్టిలోనే ఒక వింతజీవి. నిన్న ఒక మాట నేడొక మాట. పోలవరం, ప్రత్యేక హోదాపై ఎప్పుడేం మాట్లాడతారో తెలియదు. నిన్న మోదీ.. నేడు రాహుల్ గాంధీ ని పొగుడుతారు. సోషల్ మీడియాలో ఆయనపై వస్తున్న ప్రచారం చూస్తే ఒక్క రోజు కూడా ఆయన సీట్లో కూర్చోవాలని అనుకోము అని దగ్గుబాటి వ్యాఖ్యానించారు.

ముఖ్యమంత్రి అవినీతిపరుడని కూడా ఆయన ఆరోపించారు. రాజధాని భూములను ఒక్కొక్కరికి ఒక్కో రేటుకు ధారాదత్తం చేస్తున్నారని ఆయన అన్నారు. పోస్ట్ డేటెడ్ చెక్కులతో రైతులను, డ్వాక్రా మహిళలను ప్రభుత్వం మోసం చేస్తోంది. కేంద్రం నుంచి వచ్చిన నిధులతో నిర్మించిన రోడ్లు, మరుగుదొడ్లు చూపి తన ఘనతగా ప్రచారం చేసుకుంటున్నారు అని దగ్గుబాటి పేర్కొన్నారు.

పోలవరంపై అప్పటి ప్రధాని దేవెగౌడ నివేదిక పంపండి… మంజూరు చేస్తాను అన్నాడు. ఆరోజు చంద్రబాబు స్పందించలేదు. గ్రాఫిక్స్ తోనే అంతా చూపుతున్నారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులతో తాత్కాలిక నిర్మాణాలు చేపట్టి కేంద్రానికి తప్పుడు నివేదికలు ఇస్తున్నారు అని దగ్గుబాటి ఆరోపించారు. కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ నిర్మాణం ఏళ్ళ తరబడి జరుగుతోంది. ఉక్కు ఫ్యాక్టరీ, రామాయపట్నం పోర్ట్ లకు కేంద్రానికి నివేదికలు ఇవ్వలేదు. ఎన్నికల కోసం ఇప్పుడు శంకుస్థాపనలు చేస్తున్నారు అన్నారాయన.

చంద్రబాబు వద్ద పని చేసే అధికారులే ఆయన గురించి సరిగ్గా చెబుతారని ఆయన వ్యాఖ్యానించారు. పోలీస్ వ్యవస్థ తో సహా అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారు. ఇంటెలిజెన్స్ డిజి స్వయంగా ప్రతిపక్షంలో వున్న వారితో మాట్లాడుతూ.. ప్రలోభాలు చూపుతున్నారు. భూదందాల్లో జోక్యం చేసుకుంటూ అధికారపార్టీ కోసం పని చేస్తున్నారు. ఇక స్పీకర్ వ్యవస్థను దిగజార్చేశారు. స్పీకర్ వ్యవస్థకు తూట్లు పొడుస్తూ.. ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు అంటూ దగ్గుబాటి విమర్శలు గుప్పించారు.

పనిలో పనిగా ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణపై కూడా విమర్శలు చేశారు. ఆయన జర్నలిజాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. పట్టిసీమపై నిజాలను రాధాకృష్ణ బయటపెట్టగలరా.  పట్టిసీమ, పోలవరం, హంద్రీనీవా పనుల్లో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కు కమీషన్లు వున్నాయి. రాజధాని పనుల్లోనూ రాధాకృష్ణ కు కమీషన్లు వున్నాయి. రాధాకృష్ణ జర్నలిజం రాష్ట్ర ప్రజలకు మేలు చేసేలా లేదు అని దగ్గుబాటి వ్యాఖ్యానించారు.