(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
మీరు నిరంతరం సెల్‌ఫోన్ చూస్తున్నారా? అయితే మీకు కొమ్ములు మొలుస్తాయి. కంగారు పడకండి. బయటకు కనబడే కొమ్ములు కావు. అయితే ఈ మార్పులు పరిణామ క్రమంలో ఏదో నాటికి మానవులకు తల వెనుకభాగంలో చిన్న కొమ్ముల లాంటి ఎత్తైన భాగాలుగా రూపొందుతాయని కొందరు శాస్త్రవేత్తలు అంటున్నారు.
ఇదంతా ఇద్దరు ఆస్ట్రేలియన్ శాస్త్రవేత్తలు 2018లో ఒక అధ్యయనం నివేదిక విడుదల చేసిన దగ్గర నుంచి మొదలయింది. క్వీన్స్లాండ్, సన్‌షైన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు డేవిడ్ షహార్, మార్క్ శాయర్ ఈ అధ్యయనం నిర్వహించారు. ఈ ఫలితాలపై ఇటీవల బిబిసి, వాషింగ్టన్ పోస్ట్ కథనాలు ఇవ్వడంతో దీనిపై చర్చ మొదలయింది.
తల వెనుకభాగంలో పుర్రె మెడను కలుసుకునే చోట రెండు పక్కలా సహజంగానే బుడిపెల లాగా కాస్త ఎత్తుగా ఉంటుంది. అవి అంగుళంలో మూడవ వంతు నుంచి అంగుళం వరకూ పెరిగినట్లు తమ అధ్యయనంలో తేలిందని వారు ప్రకటించారు. ఎక్కువ సేపు తల వంచి సెల్‌ఫోన్ చూడడం వల్ల ఈ మార్పు వచ్చినట్లు వారు సిద్ధాంతీకరించారు. 18 నుంచి 30 సంవత్సరాల లోపు వయసు యువతలో ఈ మార్పు ఎక్కువ కనబడుతున్నట్లు వారు పేర్కొన్నారు.
తల ఎక్కువ సేపు వంచి ఉంచడం వల్ల వెనుకభాగంలో బుడిపెల లాగా ఎముకల పెరుగుదల ఉంటుందన్నది వాస్తవమేనని ఎక్కువమంది శాస్త్రవేత్తలు అంటున్నారు. అయితే చాలామంది శాస్త్రవేత్తలు ఆస్ట్రేలియన్ శాస్త్రవేత్తల అధ్యయనం ఫలితాలతో ఏకీభవించడం లేదు. ఈ మార్పులను సెల్‌ఫోన్ వాడకంతో లింక్ చేయడానికి తగినంత అధ్యయనం జరగలేదనీ, ఇంకా ఎక్కువ డేటా అందుబాటులోకి వచ్చిన తర్వాత గానీ ఒక నిశ్చితాభిప్రాయానికి రాలేమనీ అంటున్నారు.
న్యూయార్క్‌కు చెందిన వైద్య శాస్త్రవేత్త ఇవాన్ జాన్సన్ మరొక ఆందోళనకరమైన అంశం లేవనెత్తారు. ఆస్ట్రేలియన్ శాస్త్రవేత్తల అధ్యయనం నివేదికలో కొందరి మెడ పర్మినెంట్‌గా కాస్త ముందుకు వంగిపోయి కనబడిందనీ, ఇది చాలా ఆందోళనకరమైన అంశమనీ ఆయన అంటున్నారు. సెల్‌ఫోన్ వాడకం వల్ల మానవుల అస్థిపంజరంలో పరిణామగత మార్పులు చోటు చేసుకోవడం అనేది చిన్న విషయం కాదని ఆయన వ్యాఖ్యానించారు.