సీఎం పదవికి ఫడ్నవీస్ రాజీనామా!

ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ గడువు శుక్రవారంతో ముగిసిన నేపథ్యంలో సీఎం పదవికి దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా చేశారు. శుక్రవారం బీజేపీ నేతలతో కలిసి రాజ్ భవన్ వెళ్లిన ఫడ్నవీస్.. గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీకి తన రాజీనామా పత్రం సమర్పించారు. గవర్నర్ తన రాజీనామాను ఆమోదించినట్లు ఆయన తెలిపారు. ఈ ఐదేళ్లలో తాము ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నామని, ఇందుకు సహకరించిన పార్టీ సహచరులకు, శివసేన నేతలకు ధన్యావాదాలు తెలిపారు. రాష్ట్రంలో మెజార్టీ స్థానాలు సాధించిన అతిపెద్ద పార్టీ తమదేనని, రెండున్నరేళ్ల పదవీకాలంపై ఏనాడూ చర్చ జరగలేదని ఫడ్నవీస్ తెలిపారు.

ప్రస్తుత రాష్ట్ర అసెంబ్లీ గడువు శుక్రవారంతో ముగిసింది. దీంతో మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో మిత్రపక్షాలైన బీజేపీ, శివసేన కూటమి స్పష్టమైన మెజారిటీతో విజయం సాధించినా.. అధికార పీఠం విషయంలో ఇరు మధ్య విభేదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. సీఎం పదవిని చెరి సగం కాలం పంచుకోవాలనే శివసేన డిమాండ్ ను బీజేపీ అంగీకరించడం లేదు. దీంతో ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం సాగింది. ఈసారి కూడా పూర్తి కాలం తానే ముఖ్యమంత్రిగా కొనసాగతానని ఫడ్నవీస్ గతంలో చెప్పారు. శివసేనకు డిప్యూటీ సీఎం పదవి, కీలక మంత్రి పదవులు ఇస్తామని కూడా హామీ ఇచ్చారు. అయితే, శివసేన మాత్రం 50: 50 ఫార్ములాకే కట్టుబడి ఉంది. అక్టోబర్ 24న ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి ప్రభుత్వ ఏర్పాటులో మిత్రపక్షాలైన బీజేపీ-శివసేనల మధ్య సంధి కుదరలేదు. దీంతో ప్రభుత్వ ఏర్పాటు విషయంపై ప్రతిష్టంభన కొనసాగింది. మొత్తం 288 స్థానాలు గల మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు 145 మంది సభ్యుల మద్దతు కావాలి. బీజేపీ 105 స్థానాలు, శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 స్థానాల్లో విజయం సాధించాయి.