‘అమ్మాయిలు పొట్టి దుస్తులు ధరించొద్దు’

బెంగళూరు: సంప్రదాయ దుస్తులను ధరించలేదని యువతి పట్ల ఓ వ్యక్తి అమర్యాదగా ప్రవర్తించాడు. ఈ ఘటన బెంగళూరులోని హెచ్‌ఎస్‌ఆర్ లే అవుట్‌లో చోటు చేసుకుంది. ఓ యువతి తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి షాపింగ్ కు వెళ్లింది. ఈ సందర్భంగా కురచ దుస్తులు ధ‌రించింద‌ని ఐటీ ఉద్యోగిపై సదరు వ్యక్తి మండిపడ్డాడు. సంప్రదాయ దుస్తులను ధరించకుండా షార్ట్స్ ఎందుకు వేసుకున్నావని, అలా ఉండడం సభ్యత కాదన్నాడు. భారత సంప్రదాయాన్ని పాటిస్తూ దుస్తులు ధరించాలని సూచించారు. ఈ క్రమంలో సదరు యువతి బాయ్ ఫ్రెండ్ ఆ వ్యక్తిని వీడియో తీశారు. అయితే తనను వీడియో తీస్తున్నారని తెలుసుకున్న ఆ వ్యక్తి కొంచెం వెనక్కి తగ్గి.. మళ్లీ అవే కామెంట్లు చేశాడు. తన పట్ల అమర్యాదగా మాట్లాడడం ఆపకపోతే వెంటనే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తానని యువతి చెప్పింది. దీంతో ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..!

నాగరిక ప్రపంచంలో మనుషులందరికి ఒకే రకమైన హక్కులు ఉంటాయి. పురుషులతోపాటు స్త్రీలకు కూడా అవే హక్కులున్నాయి. వారికి నచ్చిన ఏ దుస్తులనైనా వారు ధరించవచ్చు. అయితే, చరిత్ర, వారసత్వం, సంస్కృతి పేర్లు చెప్పి స్త్రీల స్వేచ్ఛను కబళించే ప్రయత్నం చేస్తున్నారు కొందరు. కురచ దుస్తులు ధరించడం వల్లే అత్యాచారాలు పెరిగిపోయాయని వాదిస్తున్నారు.