NewsOrbit
టాప్ స్టోరీస్

‘ఆంగ్ల’ ప్రదేశ్!

(న్యూస్ ఆర్బిట్ ప్రత్యేక ప్రతినిధి)
అమరావతి : ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా ఎత్తివేస్తూ జగన్ సర్కార్ జారీ చేసిన జీవో ఎం ఎస్ 81 ప్రాథమిక విద్యాబోధనకు సంబంధించిన అనేక ప్రశ్నలను తిరిగి తెరపైకి తెచ్చింది. వైఎస్ జగన్ ప్రభుత్వం విడుదల చేసిన ఈ జీవోను తెలుగు గడ్డపైనే తెలుగు భాషకు సజీవ సమాధి కట్టడంతో తప్ప ఇంకే విధంగానూ పోల్చలేం.
6500 ప్రభుత్వ పాఠశాలల్లో ఆరో తరగతి నుంచి ఇంగ్లీష్ మీడియాన్ని  ప్రవేశపెట్టడం (జీవో నెం.76) 2008 నుంచి మొదలైంది. అప్ప‌టి ముఖ్యమంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి స‌క్సెస్ స్కూల్స్ పేరుతో తెలుగు మీడియంతో పాటు స‌మాంత‌రంగా ఇంగ్లిష్ మీడియం త‌ర‌గ‌తులను నిర్వ‌హించాలని నిర్ణయించారు. ఆ తర్వాత దశలవారీగా ఇంగ్లీషు మీడియం స్కూళ్లని పెంచడం సాగుతూ వచ్చింది. 2018-19 విద్యా సంవత్సరం నుంచి (G.O.Rt.No.78 Education (Prog.I) Dept, dt. 05.10.2017) ప్రాథమిక పాఠశాలలన్నిట్లోనూ ఇంగ్లీష్ మీడియం సమాంతరంగా అమలు కావడం ప్రారంభమైంది. అంతదాకా ఇంగ్లీషు మీడియం తప్పనిసరి కాదు. తెలుగు మీడియం కూడా సమాంతరంగా కొనసాగుతూ వచ్చింది. కానీ వైఎస్ జగన్ ఇప్పుడు తెలుగు మాధ్యమానికి పూర్తిగా మంగళం పాడేశారు. తన తండ్రి వైఎస్ఆర్ నాడు ప్రారంభించిన ఇంగ్లీషు మీడియం స్కూళ్లకి వైఎస్ జగన్ ఇప్పుడు పూర్తిగా పట్టంగట్టారు. 2020-21 విద్యాసంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ, ఎంపీపీ, జెడ్పీపీ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచే ఇంగ్లీష్ మీడియాన్ని తప్పనిసరి చేశారు. 2022-23 నుంచి టెన్త్ క్లాసుకు కూడా ఇది వర్తిస్తుంది. జీవో 81కి ఒకటి రెండు మార్పులేవో చేస్తామంటున్నారు. అదలావుంచితే తెలుగును పూర్తిగా ఎత్తివేయడం ఎవరికి లాభం? ఎవరికి నష్టం? ఈ నిర్ణయం ద్వారా ప్రభుత్వం ఆశిస్తున్న ప్రయోజనం ఏమిటి? విద్యాబోధనలో కీలకమైన మార్పులేమైనా తేవాలనుకుంటున్నప్పుడు దానిని ప్రజల ఎదుట చర్చకు పెట్టవలసిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? విద్యావేత్తలతో చర్చించి ఏకాభిప్రాయసాధనకు ప్రయత్నించవలసిన అగత్యం లేనేలేదా? తగిన కసరత్తు ఏదీ చేయకుండానే తెలుగును ఎత్తేసి ఇంగ్లీషు పెట్టేస్తున్నామని చెప్పడం తెలుగుజాతిపై సర్జికల్ స్ట్రైక్ కాదా? తెలుగు మానేసి ఇంగ్లీషులోనే చదవడం వల్ల ఫలాన గొప్ప ప్రయోజనం కలుగుతుందని ఏదైనా పరిశోధనలో తేలిందా? అలాంటి నివేదికలేమైనా  వైఎస్ జగన్ దగ్గర ఉన్నాయా? ఉన్నట్టుండి తెలుగును నిషేధించేసి ఇంగ్లీషు మీడియం పెట్టడం ద్వారా వైఎస్ జగన్ నాటి లార్డ్ మెకాలే (థామస్ బాబింగ్టన్)ని మరిపించారనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.
2015లో సిద్ధ రామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలోని అన్ని పాఠశాలల్లో 5వ తరగతి వరకు కన్నడ మాధ్యమాన్ని తప్పనిసరి చేసింది. అంతేకాదు 6 నుంచి 10 వ తరగతి దాకా కన్నడ భాషని ఒక సబ్జెక్టుగా బోధించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని నాడు ఆరెస్సెస్ కూడా ప్రశంసించి స్వాగతించింది. అయితే విచిత్రంగా బీజేపీ నాయకత్వంలోని కర్ణాటక ప్రభుత్వం ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచే ఇంగ్లీషు మీడియం బోధన ప్రవేశపెట్టాలని 2018లో నిర్ణయించింది. ఇది అక్కడ పెను వివాదంగా మారి చర్చకు దారితీసింది. నిజానికి ఇంగ్లీష్ పట్ల ఉన్న క్రేజ్ చివరికిలా మాతృభాషలనే బలితీసుకుంటోందని పలువురు భాషావేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ వైఎస్ జగన్ ఎదురుప్రశ్నలతో తన వాదన వినిపిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టినందుకు విమర్శలు చేస్తున్న వారంతా వాళ్ల పిల్లల్ని ఎక్కడ చదివిస్తున్నారో చెప్పాలన్నారు. చంద్రబాబు కొడుకు, మనవడు ఎక్కడ చదువుతున్నారు.. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడి పిల్లలు, మనవడు ఇంగ్లీష్ మీడియంలో చదవలేదా.. పవన్ కళ్యాణ్ పిల్లల్ని ఎక్కడ చదివిస్తున్నారు…అంటూ జగన్ ప్రశ్నించారు. ప్రపంచ స్థాయి కోసం ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం తెస్తుంటే.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, చంద్రబాబు, వెంకయ్య, పవన్ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. పేదల పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదవకూడదా? అంటూ ఒంటికాలిపై లేస్తున్నారు. పేదల పిల్లలు ఇంగ్లీషు మీడియం చదవకూడదని ఎవరూ అనలేదు. అనరాదు కూడా. కానీ తమ మాతృభాష అయిన తెలుగు మీడియంలో చదువుకోవా లనుకునేవారి అవకాశాలను ఎలా దెబ్బ తీస్తారు? రెండు మాధ్యమాల్లోనూ విద్యాబోధన కొనసాగించే వెసులుబాటు ఉండగా తెలుగును ఎలా ఎందుకు నిషేధిస్తారు? పిల్లలంతా ఇంగ్లీషు మీడియంలోనే చదవాలని ప్రభుత్వం ఏకపక్షంగా ఎలా నిర్ణయిస్తుంది? రేపు ఈ నిర్బంధ చర్య వల్ల గిరిజన, దళితవర్గాల పిల్లలు చదువులు అర్థంతరంగా ఆపేస్తే దానికి బాధ్యులెవరు? రాష్ట్రంలోని ఉర్దూ, త‌మిళ‌, క‌న్న‌డ పాఠశాలలు కూడా తప్పనిసరిగా ఇంగ్లీష్ మీడియంలోకి మారవలసిన పరిస్థితి ఏర్పడలేదా? ఇత్యాది ప్రశ్నలకు వైఎస్ జగన్ జవాబు ఇవ్వరేం!
81 జీవో నేపథ్యంలో వైఎస్ జగన్ దృష్టికి ఓ అధ్యయనం తాలూకు అంశాలను తీసుకువెళ్లవలసిన అవసరం ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ, తూర్పు గోదావరి, మెదక్, నిజామాబాద్, కడప జిల్లాల్లో అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ (ఏపీఎఫ్) ఐదేళ్ల పాటు 2008-2013 మధ్య ఒక అధ్యయనాన్నినిర్వహించింది. 180 గ్రామాల్లో పదివేలకి పైచిలుకు విద్యార్థులపై ఈ అధ్యయనం సాగింది. ప్రేవేటు పాఠశాలల్లోని ఇంగ్లీష్ మీడియం పిల్లలు బాగా చదివేసి ప్రభుత్వపాఠశాలలకు చెందిన విద్యార్థులకన్నా ముందుంటారన్న భ్రమను ఈ అధ్యయం పటాపంచలు చేసింది. ప్రైవేటు స్కూళ్లలో చేరి చదువుకునేందుకు ఫీజులు చేల్లించి మరీ అజీమ్ ప్రేమ్ జీ ఫౌండేషన్ ఈ అధ్యయనం నిర్వహించింది. ఈ ఐదేళ్లలో.. ప్రభుత్వ తెలుగు మీడియం పిల్లలే… చివరికి ఇంగ్లీషు, లెక్కలతో సహా అన్ని సబ్జెక్టుల్లో… ప్రైవేటు ఇంగ్లీషు మీడియం పిల్లల కన్నా ముందున్నట్లు ఈ అధ్యయనంలో తేలింది. అర్థమయ్యే భాషలో బోధించడమే ముఖ్యమన్న సంగతి మరోమారు రుజువైంది.
(అధ్యయనం వివరాల కోసం క్లిక్ చేయండి)
విద్యాబోధన విషయంలో కనీసం పొరుగు తెలుగు రాష్ట్రమైన తెలంగాణని చూసైనా జగన్ నేర్చుకోకపోవడం దురదృష్టకరం. కేసీఆర్ ప్రభుత్వం తెలుగును ప్రోత్సహించేందుకు ఇటీవల అనేక చర్యలు చేపట్టింది.1 నుంచి 10వ తరగతి వరకు తెలుగు భాషను తప్పనిసరిగా బోధించాలని నిర్దేశించింది. అలా బోధించని ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలలకు నోటీసులు కూడా జారీ చేస్తోంది. సరైన కారణాలు చూపకపోతే స్కూళ్లకి మొదట రూ.50 వేలు, ఆ తర్వాత రూ. లక్ష జరిమానా విధిస్తోంది.
ఇక ప్రపంచంలో ఇంగ్లీషుతో సంబంధం లేకుండానే అత్యద్భుత ప్రగతి సాధించిన దేశాలు అనేకం ఉన్నాయని వైఎస్ జగన్ గమనించాలి. చైనా నుంచి జపాన్ దాకా, రష్యా నుంచి జర్మనీ దాకా ఎన్నో దేశాలు ఇంగ్లీషును కేవలం ఒక భాషగానే చూస్తాయి తప్ప నిర్బంధం చేయవు. ఇందులో అనేక యూరోపియన్ దేశాలూ ఉన్నాయి. బ్రిటీష్ వలస పాలన సాగిన దక్షిణాఫ్రికా, భారత్ వంటి కొన్నిదేశాల్లోనే ఇంకా ఇంగ్లీషు ప్రాభవం ఉంది. మాతృభాషలో జరిగే విద్యాబోధన వల్లే సృజనాత్మకత పెరుగుతుందని అనేక అధ్యయనాలు వెల్లడించాయి. ఇందులో ఎలాంటి విప్రతిపత్తీ లేదు. నేల విడిచి సాము చేయడం వల్ల అనర్థమే తప్ప ఇంకేమీ జరగదు. ఒకనాడు భారతీయులను బౌద్ధికంగా యూరోపియన్లుగా మార్చడం కోసం ఇంగ్లీషును ఈ దేశంపై రుద్దారు. స్వాతంత్ర్యం వచ్చాక కూడా అనేక  కారణాల వల్ల మాతృభాషలకు దక్కాల్సిన  గౌరవం దక్కలేదు.  అదంతా అలా ఉంచితే… ఒక్క కలంపోటుతో తెలుగు మీడియం ఎత్తివేసిన  వైఎస్ జగన్ తెలుగు అకాడమీకి చైర్ పర్సన్ గా నందమూరి లక్ష్మీపార్వతిని ఎందుకు నియమించినట్లు? తెలుగు అకాడమీ చేసే పని తెలుగులో శాస్త్రపరిభాషను సృష్టించి పాఠ్యపుస్తకాలు తయారు చేయడం. తెలుగే లేకపోతే ఇంక అదెందుకు? అలాగే యార్లగడ్డవారి అధికారభాషాసంఘం నిర్వహించే మహత్కార్యం మాత్రం ఏముంటుందీ? ప్రభుత్వ జీతభత్యాలతో శేషజీవితం గడపడం తప్ప!
‘తెలుగు’దేశం పార్టీపై కక్షతో కనుక వైఎస్ జగన్ తెలుగు రద్దు నిర్ణయం తీసుకుని ఉంటే ఏం చేయలేం కానీ…విద్యార్థుల హితం, ఆంధ్రభాషాభవితవ్యం దృష్ట్యా మాత్రం ఇంగ్లీషు మీడియం సంగతి పునరాలోచించవలసిందే. లేకపోతే ఆంధ్రం… ఆంధ్రప్రదేశ్ పేరులో మాత్రమే మిగులుతుంది. లేదంటే ఆంధ్రప్రదేశ్ పేరును ఆంగ్లప్రదేశ్ గా మార్చుకుంటారోమో తెలియదు. మా తెలుగు తల్లికి మల్లెపూదండ వేయకపోతే వేయక పోయారు కానీ ముళ్లపూదండ మాత్రం వేయొద్దని తెలుగు భాషాభిమానులు కోరుకుంటున్నారు.
ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన 81 జీవో ప్రతి కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
author avatar
Srinivasa Rao Y

Related posts

Ayodhya : జ‌న‌వ‌రి 22 : అయోధ్య రామ‌మందిరం ఓపెనింగ్‌.. మీ గ్రామాల్లో ఈ ప‌నులు చేయండి..!

Saranya Koduri

Subrata Roy: సుబ్రతా రాయ్ ఇక లేరు…సహారా గ్రూప్ స్థాపకుడుకి 75 సంవత్సరాలు, దీర్ఘకాలిక అనారోగ్యం తో కన్ను మూత.

Deepak Rajula

International Girl Child Day: అంతర్జాతీయ బాలికా దినోత్సవంపై స్పెషల్ స్టోరీ.. 2023 థీమ్ ఏంటి? దీని చరిత్ర..

siddhu

Amaravati Capital Case: అమరావతి రాజధాని కేసు డిసెంబర్ కు వాయిదా వేసిన సుప్రీం కోర్టు .. ఏపీ సర్కార్ కు షాక్ | Supreme Court Shocks AP Govt in Amaravti Case 

sharma somaraju

Kuno National Park: కునో నేషనల్ పార్కుకు మరో 12 చిరుతలు.. ఈ పార్కుకు వెళ్లాలని అనుకుంటున్నారా? హైదరాబాద్, విజయవాడ నుంచి ఇలా వెళ్లండి!

Raamanjaneya

Mughal Gardens: అమృత ఉద్యాన్‌గా మొఘల్ గార్డెన్.. దీని చరిత్ర.. ప్రత్యేకతలు!

Raamanjaneya

థార్ డెసర్ట్‌లో ఇసుక తిన్నెలు నడుమ అద్భుతమైన ఆహారం,  ప్రదర్శనలు, కచేరీలు!

Raamanjaneya

KCR’s BRS: నూతన శాతవాహన సామ్రాజ్యం దిశగా పావులు కదుపుతున్న నయా శాతవాహనుడు సీఎం కేసీఆర్

sharma somaraju

ఆ ఇద్దరూ ఒకే వేదికపై ..! బీజేపీ భారీ ప్లాన్స్, సక్సెస్ అవుతాయా..!?

Special Bureau

Why Lawrence Bishnoi wants Salman Khan Dead? నాలుగు సంవత్సరాల నుండి సల్మాన్ నీ చంపడానికి ప్లాన్ చేస్తున్న దుండగులు..!!

Siva Prasad

PK Team: పీకే టీమ్ – 1500మంది రెడీ ..! వైసీపీ కోసం భారీ ప్లాన్స్..!

Special Bureau

YSRCP: ఈ విషయాలు గమనిస్తే దటీజ్ జగన్ అనాల్సిందే(గా)..?

sharma somaraju

Rahul Gandhi: వరంగల్ సభలో టీఆర్ఎస్ పై రాహుల్ సీరియస్ కామెంట్లు..!!

sekhar

Telangana Crime: భాగ్యనగరంలో అమానవీయ ఘటన! పదహారు మంది బాలల బట్టలూడదీసి కొట్టినా కిమ్మనని పోలీసులు,కెసిఆర్ సర్కారు!

Yandamuri

TDP ChandraBabu: కార్యకర్తలపై కేసులు.. బాబోరీ వెరైటీ కూతలు..!!

sekhar

Leave a Comment