నన్ను చంపేస్తారు!

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)

హైదరాబాద్ డిసెంబర్ 24: టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఎమ్మెల్సీ రాములు నాయక్ తీవ్ర ఆరోపణలు చేశారు. తనను అంతం చేయాలని టీఆర్ఎస్ నేతలు కొందరు కుట్ర పన్నారని ఆయన ఆరోపించారు.  తనకు ఏదైనా హాని జరిగితే అందుకు టీఆర్ఎస్ ప్రభుత్వానిదే బాధ్యత అని ఆయన అన్నారు. గిరిజనుల తరపున మాట్లాడుతున్నందుకే తనను లక్ష్యంగా చేసుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

పార్టీ ఫిరాయింపులపై ఈనెల 18న తనకు నోటీసు వచ్చిందని.. దానికి వివరణ ఇచ్చానని… పూర్తి వివరాలు ఇవ్వడానికి నాలుగు వారాల గడువు కావాలంటూ కోరానని రాములు నాయక్ తెలిపారు. అయితే తన విన్నపాన్ని శాసనమండలి ఛైర్మన్ తిరస్కరిస్తున్నారని విమర్శించారు. తాను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కానన్నారు. తాను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమితులయ్యానని ఆయన వివరించారు. సోషల్ వర్క్ కోటాలో ఎమ్మెల్సీ పదవి వచ్చిందని తెలిపారు. తనపై ఫిర్యాదు చేసిన బోడకుంటి వెంకటేశ్వర్లు కూడా పార్టీ మారిన వ్యక్తేనని దుయ్యబట్టారు. మొన్నటి వరకు టీఆర్ఎస్‌లో పొలిట్ బ్యూరోనే లేదని, కానీ, తానను పొలిట్ బ్యూరో మెంబర్ గా పేర్కొంటూ ఫిర్యాదు చేశారని ఆయన వాపోయారు.