‘భారత్ ఒక్కటిగానే పోరాడుతుంది.. గెలుస్తుంది’


న్యూఢిల్లీ: భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో రాజకీయ సభలేంటంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలను పట్టించుకోకుండా ప్రధాని నరేంద్ర మోదీ గురువారం బీజేపీ కార్యకర్తలతో అతిపెద్ద వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దాదాపు కోటి మంది బీజేపీ కార్యకర్తలు, మద్దతుదారులతో ఈ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.

‘భారతదేశం ఒక్కటిగానే పోరాడుతుంది. ఇండియా ఒక్కటే’ అని ప్రధాని మోదీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. పాకిస్థాన్‌ మనల్ని విభజించాలని చూస్తోందని, భారతీయులంతా జవాన్లలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని, జవాన్లకు మద్దతుగా నిలవాలని దేశ యువతకు పిలుపునిచ్చారు.

‘మన ఉద్దేశాన్ని ప్రపంచం గమనిస్తోంది. మనకు మన జవాన్ల శక్తి సామర్థ్యాలపై పూర్తి నమ్మకం ఉంది. వారు మన దేశం వైపు శత్రువులకు వేలు చూపే అవకాశం కూడా ఇవ్వరు’ అని మోదీ అన్నారు.

‘మన శత్రువు మనల్ని అస్థిరపర్చాలని చూస్తోంది. ఉగ్రదాడులను ప్రోత్సహిస్తోంది. మన అభివృద్ధిని ఆపడమే వారి ఉద్దేశం. దేశ ప్రజలందరూ జవాన్లలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. దేశం కోసం పోరాటం చేసే జవాన్లకు మద్దతుగా నిలవాలి. భారత్‌ ఐక్యంగా పోరాడుతూనే ఉంటుంది. ఒక్కటిగానే భారత్ గెలుస్తుంది’ అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.

‘యువత చేస్తున్న ఉద్యోగం, పని ఏదైనా సరే.. కాస్త ఎక్కువగా చేయండి. ఉన్నత శిఖరాలు చేరుకోవడానికి కష్టపడి పనిచేయండి. కొత్త ఇండియా కోసం ప్రయత్నాలు జరుపుదాం. ప్రజల్లో మాపై చాలా నమ్మకం ఉంది. ప్రభుత్వ నూతన విధానాలతో దేశ ప్రజల్లో కొత్త ఉత్సాహం నిండింది’ అని ప్రధాని అన్నారు.

‘2014 నుంచి 2019 వరకు అనుకున్న లక్ష్యాలను సాధించాం. 2024లోపు ప్రజల ఆకాంక్షలన్నింటినీ నెరవేర్చాల్సి ఉంది. ఈ ఐదేళ్లు దేశ ప్రజలకు ప్రాథమిక వసతులు కల్పించాం. ఇక రానున్న ఐదేళ్లు దేశం వేగంగా అభివృద్ధి చెందాల్సి ఉంది. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ను తీర్చిదిద్దడమే మా లక్ష్యం’ అని మోదీ పేర్కొన్నారు. ఇంతకుముందు ప్రజల కనీస అవసరాలు తీర్చడం ఎజెండాగా ఉండేదని, ఇప్పుడు దేశవాసుల కలలను సకారం చేయడమే ఎజెండాగా మారిందని వ్యాఖ్యానించారు.