ఎన్నికల ముందు హర్యానాలో కాంగ్రెస్‌కు షాక్!

న్యూఢిల్లీ: ఎన్నికల ముంగిట హర్యానా కాంగ్రెస్ నుంచి ఒక ముఖ్యమైన నాయకుడు నిష్క్రమించారు. మాజీ పిసిసి ఛీప్ అశోక్ తన్వర్ శనివారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామాను ట్వీట్ చేసిన తన్వర్ నాలుగు పేజీల రాజనామా లేఖను కూడా పోస్టు చేశారు. పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీని ఉద్దేశించి రాసిన ఆ లేఖలో, కాంగ్రెస్ ఉనికి నిలబెట్టుకునే సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. అయితే దానికి కారణం రాజకీయ ప్రత్యర్ధులు కాదు. అంతర్గత వైరుధ్యాలు అని ఆయన పేర్కొన్నారు.

కాంగ్రెస్ కార్యకర్తలకూ, ప్రజలకూ బాగా తెలిసిన కారణాల వల్ల నేను కాంగ్రెస్ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను అని ఆయన పేర్కొన్నారు. తన్వర్‌ను గత నెలలోనే పిపిసి అధ్యక్ష పదవి నుంచి తొలగించారు.  మాజీ ముఖ్యమంత్రి  భూపీందర్ సింగ్ హుదా వత్తిడి కారణంగా నాయకత్వం ఆయనను తప్పించింది. రెండు వారాలలో జరగనున్న ఎన్నికలలో పార్టీ టికెట్ల కేటాయింపు సవ్యంగా లేదని ఆరోపిస్తూ సోనియా గాంధీ  ఇంటి ముందు తన్వర్ నిరసనకు కూడా దిగారు.