ఇరానియన్ టీవీలో మాజీ మేయర్ అంగీకారం
టెహ్రాన్: మహ్మద్ అలీ నజాఫీ తనకు తానుగా ఇరానీ అధికారులకు లొంగిపోయినపుడు మంచి సూటు వేసుకుని నవ్వుతూ వచ్చారు. పోలీసులు ఆయనను సాదరంగా స్వాగతించారు. టెహ్రాన్ నగర మాజీ మేయర్ అయిన నజాఫీ అక్కడ ఓ విషయం చెప్పడానికి వచ్చారు. తన భార్య మిత్రా ఒస్తాద్ ను తానే చంపినట్లు అంగీకరించారు. విడాకులు ఇవ్వడానికి ఆమె నిరాకరించడంతో తొలుత తుపాకితో బెదిరించానని అన్నారు. ఆమెను బాత్రూంలో ఊరికే బెదిరిద్దామని అనుకున్నానని, కానీ ప్రమాదవశాత్తు తుపాకి పేలిందని నజాఫీ (67) వెల్లడించారు. ఈ విషయమంతటినీ ఆయన టీవీలో చెప్పారు. వాషింగ్టన్ పోస్ట్ పత్రిక ఈ కథనం ప్రచురించింది.
ఇరానీ అధికారిక టీవీ నజాఫీ ప్రకటన మొత్తాన్ని రికార్డు చేసింది. ఆయన గతంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. ప్రపంచ ప్రఖ్యాత మసాచుసెట్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదివారు. అలాంటి వ్యక్తి ఆ తర్వాత చేతులకు బేడీలు వేసి ఉండగా, పోలీసు స్టేషనులో చాలా మామూలుగా ఏమీ జరగనట్లు టీ తాగుతూ కనిపించారు. అక్కడే ఓ విలేకరికి ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. తొలుత తామిద్దరి మధ్య చిన్నపాటి వాగ్వాదం నడిచిందని, తర్వాత ఆమె స్నానం చేయడానికి సిద్ధమవుతుండగా.. భయపెట్టేందుకు తుపాకి చూపించానని నజాఫీ అన్నారు. దాంతో ఆమె భయపడిపోయి, తన చేతిలోంచి తుపాకి లాక్కోడానికి తనపై దాడి చేసిందని, ఆ హడావుడిలో తాను పొరపాటున ట్రిగ్గర్ నొక్కానని తెలిపారు.
తర్వాత ఇరానీ అధికారిక చానల్ ఐఆర్ఐబీలో ఒక రిపోర్టర్.. నజాఫీ తుపాకీ తీసుకుని, అందులో ఎన్ని బుల్లెట్లు మిగిలి ఉన్నాయో చూశారు. ఆయన భార్య ఒస్తాద్ శరీరంలో రెండు బుల్లెట్లు దిగగా, మరొకటి గోడలోకి దిగింది. అయితే, ఇప్పటివరకు ఈ కేసులో నేర దర్యాప్తు జరగడం లేదని, ఇరానీ న్యాయవ్యవస్థ ప్రమాణాల ప్రకారం చూసినా అలా లేదని టెహ్రాన్ కు చెందిన న్యాయవాది షాడీ సదర్ చెప్పారు. రివాల్వర్ మీద వేలి ముద్రలు, బాధితురాలి శరీరంలో ఉన్న బుల్లెట్లు ఆ రివాల్వర్ నుంచి వచ్చినవేనా అనే విషయం 24 గంటల్లోగా తెలియదని అన్నారు. పైగా.. హత్యాయుధాన్ని కెమెరా ముందు ఆడుకోడానికి ఎవరికి పడితే వారికి ఇవ్వకూడదని తెలిపాు.
నజాఫీ రాజకీయ చరిత్ర కారణంగా కేసుకు ప్రాముఖ్యత వచ్చింది. మేయర్ పదవిలో 8 నెలలు మాత్రమే ఉన్న తర్వాత అనారోగ్య కారణంగా ఆయన రాజీనామా చేశారు. అయితే, ఆయనకు ముందున్న మేయర్ మీద భద్రతాదళాలతో కుమ్మక్కై అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలపై విచారణ మొదలైన తర్వాతే ఈయన రాజీనామా చేశారు. ఆ సమయంలో నజాఫీ, ఆయన భార్య ఫొటోలు ఇంటర్ నెట్ లో వైరల్ అయ్యాయి. తన భార్య తన కదలికలను, మిత్రులను నియంత్రించడం మొదలుపెట్టిందని నజాఫీ చెప్పారు. తనకు సంబంధించిన రహస్య సమాచారాన్ని ప్రజలకు, నిఘా సంస్థలకు చెబుతానని బెదిరించేదన్నారు. ఆమెను చంపడానికి ముందు, చంపిన తర్వాత ఆత్మహత్య చేసుకుందామని కూడా అనుకున్నట్లు వెల్లడించారు.