కల్కి ఆశ్రమం అనే కుటుంబ వ్యాపారం కథ!

ఇదేదో భారీ సినిమా సెట్టింగ్ లాగా కనబడుతోంది కదూ? కాదు. వరదయపాళెంలోని వన్‌నెస్ టెంపుల్ ఇదే

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) : కల్కి భగవాన్ ఆశ్రమంపై ఆదాయం పన్ను శాఖ ఇటీవల జరిపిన దాడుల్లో బయటపడిన సంపద చూసి జనం కళ్లు బైర్లు కమ్మాయి. 500 కోట్ల రూపాయలకు పైగా ఆస్థులు, బంగారం, వెండి, నగదు, విదేశీ కరెన్సీ బయటపడ్డాయి. దాదాపు 20 కోట్ల రూపాయల విలువ గల విదేశీ కరెన్సీ దొరకడంతో కల్కి ఆశ్రమంపై విదేశీమారకద్రవ్యం నియంత్రణ చట్టం కింద దర్యాప్తు జరపనున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ ప్రకటించింది.

మరోపక్క ఆదాయంపన్ను శాఖ దాడుల దరిమిలా కల్కి భగవాన్ అలియాస్ విజయకుమార్ విదేశాలకు పారిపోయారన్న వదంతులను కొట్టిపారేసేందుకు స్వయంగా ఆయనే వీడియో విడుదల చేశారు. కొంతకాలంగా ఆయన ఎవరికీ కనబడకపోవడంతో కల్కి అసలు ఉన్నారా లేక మరణించారా అన్న సందేహాలు కూడా తలెత్తాయి. ఇప్పుడు ఐటి దాడుల పుణ్యమా అంటూ కల్కి కనబడ్డారు.

కల్కి భగవాన్ ఇంత సంపద ఎలా ఆర్జించగలిగారన్నది ఆసక్తికరమైన ప్రశ్న. కల్కి నడిపేది జనానికి ఆధ్యాత్మిక జ్ఞానం ఇచ్చే ఆశ్రమాలు అని మనం అనుకుంటాం. అవి ఒక పెద్ద ఎంటర్‌ప్రెయిజ్. భారీ వ్యాపారం. ఆ వ్యాపారాన్ని నడిపేది ఆయన కుటుంబమే. ఒక్క మాటలో చెప్పాలంటే కల్కి నడిపేది కుటుంబవ్యాపారం.

విజయకుమార్ కల్కి భగవాన్. ఆయన భార్య పద్మావతి అమ్మ భగవాన్. వీరిద్దరి పనీ బోధనలు. వీరి కుమారుడు కృష్ణాజీ. కోడలు ప్రీతాజీ. వీరిద్దరూ కలిసి అన్ని ఆశ్రమాల నిర్వహణ, ఇంకా కుటుంబానికి ఉన్న ఇతర వ్యాపారాల నిర్వహణ చూసుకుంటారు. భగవంతుడి కల్కి అవతారంగా ఆయన భక్తులు భావించే విజయకుమార్ సంసారానికీ, భవ బంధాలకూ అతీతుడు కాదు. లౌకిక వ్యవహారాలకూ, ఇహలోక సౌఖ్యాలకూ దూరం కాదు.

కల్కి అవతారం ఎత్తిన విజయకుమార్ పూర్వాశ్రమంలో ఒక ప్రయివేటు స్కూలు టీచర్. ధారాళంగా  మాట్లాడగల నేర్పు అతనికి గొప్ప వరంగా పరిణమించింది. మొదట చిత్తూరు జిల్లా, రామకుప్పంలో పది ఎకరాలలో ఒక యోగాశ్రమం మొదలయింది. ఆ ఆశ్రమం  అటు కర్నాటకకూ, ఇటు తమిళనాడుకూ కూడా బాగా దగ్గర కావడం విజయకుమార్‌కు ఉపకరించింది. యోగా గురువు కాస్తా స్వామీజీ అయ్యాడు. తర్వాత చెన్నై శివార్లలో భూమి సేకరించి నేమం అనే మరో ఆశ్రమం నెలకొల్పారు. అక్కడకు విదేశీ భక్తుల రాక మొదలయంది. ఇక ఢోకా లేకుండా పోయింది.

కొన్నాళ్లకు  చిత్తూరు జిల్లా, వరదాయపాళెంలో ఏకం అనే ఆశ్రమం ప్రారంభించారు. ఇది అన్నిటికన్నా పెద్దది. అక్కడే వన్‌నెస్  టెంపుల్ అనే యోగా, ధ్యానం కేంద్రం నెలకొల్పారు. అందులో క్లాసులకు హాజరు కావాలంటే అయిదు నుంచి పది లక్షల రూపాయల వరకూ చెల్లించాలి. ఈ మధ్యలో ఎక్కడో కల్కి అనే మాట వచ్చి చేరింది. ఇదేదో బావుందే అనుకుని దానినే ప్రచారంలో పెట్టారు.

సుమారుగా 12 ఏళ్ల  క్రితం వరదాయపాళెం ఆశ్రమంలో ఒక హత్య జరిగింది. అప్పట్లో ఆశ్రమానికి కాస్త చెడ్డ పేరు వచ్చింది. దానితో కల్కికి ప్రజా సంబంధాల విలువ తెలిసివచ్చింది. ఫలితంగా చుట్టుపక్కల చాలా గ్రామాలు దత్తత తీసుకున్నారు. వాటిలో వివిధ రకాల సదుపాయాలు కల్పించారు. స్థానికంగా ఉన్న మీడియాను ముందు నుంచీ మంచి చేసుకుంటూ వచ్చారు. వారికి ప్రతి సంవత్సరమూ ఎడ్వర్‌టైజెమెంట్ రూపేణా కొంత డబ్బు ముట్టజెపుతారు. అయినా బయటినుంచి వచ్చి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడే మీడియా ప్రతినిధుల తాకిడి కొనసాగింది. దానితో కల్కి తానే ఒక మీడియా హౌస్ నడపదలిచి స్టూడియో ఎన్ ఛానల్ కొనేశారు.

కల్కి ఆశ్రమాలకు టాలీవుడ్, బాలీవుడ్ సినీ ప్రముఖులు చాలామంది వస్తుంటారు. విదేశీ భక్తులకు కొదవ లేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలలో చాలామంది భక్తులు ఉన్నారు. వారి కోసం ఈ నాలుగు రాష్ట్రాలలోని చాలా పట్టణాలలో కల్కి కార్యాలయాలు నడుపుతారు. అక్కడ భక్తులు సమావేశమై భగవాన్ బోధనలు వింటారు. వారు తాము విరాళాలు ఇవ్వడమే కాకుండా ప్రచారం చేసి కొత్త భక్తులను సంపాదించిపెడతారు.

తాజాగా జరిగిన కల్కి ఆశ్రమాలపై ఐటి దాడుల వెనుక ఆసక్తికరమైన కథనాలు ప్రచరంలో ఉన్నాయి. కల్కి టిడిపికి అనుకూలం కాబట్టి గత ఎన్నికలలో సత్యవేడు వైసిపి అభ్యర్ధికి అడిగినంత డబ్బు ఇవ్వలేదనీ, ఆగ్రహించిన ఆదిమూలం విజయం సాధించిన తర్వాత కల్కి కష్టాలు మొదల్యయాయనీ అంటున్నారు.