‘మహా’ జగడం.. ప్రభుత్వ ఏర్పాటుపై సస్పెన్స్!

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

మహారాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుపై చిక్కుముడి మరింత జఠిలంగా మారుతున్నది. సీఎం పీఠంపై బీజేపీ, శివసేన మధ్య విభేదాలు తీవ్రమవుతున్నాయి. దీంతో మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై సందిగ్ధత కొనసాగుతోంది. 50-50 ఫార్ములాను అమలు చేయాలని, తమ నేత ఆదిత్య ఠాక్రేకు రెండున్నరేళ్లు సీఎంగా అవకాశం ఇవ్వాలని, లేకుంటే బీజేపీకి సహకరించేది లేదని శివసేన పార్టీ అధిష్ఠానం చేస్తున్న హెచ్చరికలను పట్టించుకోని దేవేంద్ర ఫడ్నవీస్, మహారాష్ట్ర సీఎంగా శుక్రవారం నాడు మరోసారి ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

శివసేనకు రెండున్నర ఏళ్ల పాటు సీఎం పదవిని అప్పగిస్తామని తామెన్నడూ హామీ ఇవ్వలేదని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ మంగళవారం కుండబద్దలు కొట్టారు. తదుపరి ప్రభుత్వంలో ఐదేళ్లపాటు తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని తేల్చిచెప్పారు. దీనిపై శివసేన తీవ్రంగా స్పందించింది.  50-50 ఫార్ములాపై సీఎంకు కౌంటర్‌ ఇస్తూ శివసేన ఒక వీడియో క్లిప్‌ను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసింది. మంగళవారం రెండు పార్టీల మధ్య జరుగాల్సిన చర్చలను కూడా శివసేన రద్దు చేసుకుంది.

ఇదిఇలా ఉంటే.. శివసేనతో ఉన్న విభేదాలు సర్దుకుంటాయని బీజేపీ నేతలు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. రెండు పార్టీల నేతల మధ్యా మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరినా, అది సుదీర్ఘకాల స్నేహాన్ని చెడగొట్టేంత తీవ్రమైనదేమీ కాదని అభిప్రాయపడుతున్నారు.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన కలిసి పోటీ చేశాయి. 288 అసెంబ్లీ స్థానాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 105, శివసేన 56 సీట్లను గెలుచుకున్నాయి. అయిదుగురు ఇండిపెండెంట్లు మద్దతివ్వడంతో శివసేన బలం 61కి పెరిగింది. బీజేపీకి ప్రభుత్వం ఏర్పాటు చేసే స్పష్టమైన ఆధిక్యం రాకపోవడంతో  సీఎం పదవీకాలాన్ని చెరిసగం పంచుకోవాలన్న డిమాండ్ ను శివసేన తీసుకొచ్చింది. అయితే, బీజేపీ మాత్రం ఇందుకు సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ముందు రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరిన సమయంలో శివసేనకు రెండున్నరేండ్లపాటు సీఎం పదవిని అప్పగిస్తామని తామెన్నడూ ఆ పార్టీకి హామీ ఇవ్వలేదని చెబుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీ, శివసేన మధ్య సంబంధాలు మరింత దిగజారాయి.