తహశీల్దార్ ఆఫీసులోనే రైతు కుటుంబం ఆత్మహత్యాయత్నం!

చిత్తూరు: తెలంగాణలో అబ్దుల్లాపూర్‌మెట్‌ తహశీల్దార్ విజయారెడ్డి హత్య ఘటన మరవకముందే ఏపీలోని చిత్తూరు జిల్లాలో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. రామకుప్పంలో రెవెన్యూ అధికారుల తీరుకు నిరసనగా, ఓ రైతు కుటుంబం సామూహిక ఆత్మహత్యాయత్నం చేసింది. తహశీల్దార్ కార్యాలయంలోనే ఉరివేసుకోవడానికి ప్రయత్నం చేసింది. అయితే, అక్కడున్నవారు వారిని అడ్డుకున్నారు. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలానికి చెందిన బాబు అనే రైతుకి చెందిన భూమిని అధికారులు మరొకరికి పట్టా చేశారు. అయితే, ఆ భూమి తమదేనంటూ బాబు రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అయితే, అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో బాబు తన కుటుంబంతో సహా తహశీల్దార్ ఆఫీసులో ఉరి వేసుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఎమ్మార్వో ఆఫీసుకు ఉరితాళ్లు బిగించి… తమ భూమి తమకు ఇవ్వకపోతే ఇక్కడే చనిపోతామని బెదిరించాడు. అయితే, అక్కడున్న కొందరు వారిని అడ్డుకున్నారు.

తహశీల్దార్ వేధింపులు తాళలేక మంగళవారం కడప జిల్లాలో ఆదినారాయణ అనే రైతు కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే. కడప జిల్లా కొండాపురం మండలం దత్తాపురం ఆదినారాయణ అనే రైతు తన తల్లిపేరుతో ఉన్న మూడున్నర ఎకరాల భూమిని తనపేరుతో మార్చాలని కోరుతూ అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేదు. దీంతో అతడు ఎమ్మార్వో ఆఫీసు ఎదుట పెట్రోల్ మీద పోసుకుని నిప్పంటించుకోబోయాడు. రెవెన్యూ సిబ్బంది రైతును అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది.