తహసీల్దార్ వేధింపులతో రైతు ఆత్మహత్యాయత్నం!

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

తెలంగాణలోని అబ్దుల్లాపూర్‌ మెట్‌ తహసీల్దార్ విజయారెడ్డి హత్య ఘటన మరువకముందే ఏపీ సీఎం వైఎస్ జగన్ సొంత జిల్లా కడపలో మరో భూ సమస్య ఘటన వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని కొండాపురం తహసీల్దార్ వేధింపులు తాళలేక ఆదినారాయణ అనే రైతు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పుంటించుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో రెవెన్యూ సిబ్బంది అతన్ని అడ్డుకున్నారు. ముంపు గ్రామమైన దత్తాపురంకు చెందిన ఆదినారాయణ అనే రైతు గ్రామంలో తల్లి పేరు మీదున్న మూడున్నర ఎకరాల భూమిని తన పేరు మీదకు మార్చి నష్ట పరిహారం చెల్లించాలని కొండాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో అనేక సార్లు విజ్ఞప్తి చేశాడు. ఏడాదిగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. అయితే రెవెన్యూ సిబ్బంది తన విజ్ఞప్తిని పెడచెవిన పెట్టడంతో మనస్థాపం చెందిన ఆదినారాయణ మంగళవారం (నవంబర్ 5, 2019) 3.30 గంటల సమయంలో తహసీల్దార్ కార్యాలయం దగ్గర ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు. అయితే అక్కడే ఉన్న రెవెన్యూ సిబ్బంది అప్రమత్తంగా ఉండటంతో ప్రమాదం తప్పింది. అనంతరం అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంవత్సరం కాలంగా తన సమస్యపై అధికారులను వేడుకుంటున్నా..  పెడ చెవిన పెట్టారని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. రెవెన్యూ సిబ్బంది నిర్లక్ష్యంతో  తీవ్ర మనస్థాపం చెంది ప్రయత్నించినట్లు పేర్కొన్నాడు.