కాశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాలకు స్వయంప్రతిపత్తి ఇస్తా!

కాశ్మీర్ లోని కొన్ని ప్రాంతాలకు స్వయంప్రతిపత్తి ఇవ్వాలంటూ నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా ప్రకటన పెను వివాదానికి తెరతీసింది. శ్రీనగర్ లో ఒక కార్యక్రమంలో మాట్లాడిన ఆయన వచ్చే ఏడాది జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి జరిగే ఎన్నికలలో తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తామన్నారు.

దీనిపై బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడింది. ఫరూఖ్ అబ్దుల్లా లడఖ్, జమ్మూ, కాశ్మీర్ ప్రాంతాలకు స్వయంప్రతిపత్తి కల్పిస్తామని చెప్పడాన్ని బీజేపీ తప్పుపట్టింది. ఫరూఖ్ అబ్దుల్లా ఈ ప్రకటన చేసిన సమయంలో బీజేపీ బహిష్కృత నేత గగన్ భగత్ కూడా ఆయన పక్కనే ఉన్నారు. ఆయన నేషనల్ కాన్ఫరెన్స్ తీర్థం పుచ్చుకున్నారు. ఆ సందర్భంగానే ఫరూఖ్ అబ్దుల్లా స్వయంప్రతిపత్తి ప్రకటన చేశారు. కాగా దాదాపు ఇదే సమయంలో పాకిస్థాన్ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ ఐక్యరాజ్య సమితి సెక్రటరీ  జనరల్ తో ఫోన్ లో మాట్లాడి కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. ఈ రెండు సంఘటనలూ కాకతాళీయమే అయినా కాశ్మీర్ విషయంలో ఇమ్రాన్ అభిప్రాయాలు, ఫరూఖ్ అబ్దుల్లా ఉద్దేశాలూ ఒకేలా ఉన్నాయంటూ బీజేపీ విమర్శలు గుప్పిస్తున్నది. దేశంలో అంతర్భాగమైన కాశ్మీర్ లోని కొన్ని ప్రాంతాలకు స్వయంప్రతిపత్తి కల్పిస్తామనడం దేశ ద్రోహం కిందకే వస్తుందని మండిపడుతోంది.