(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
లైవ్ లో వార్తను రిపోర్టు చేస్తున్న ఓ మహిళా జర్నలిస్టుకు ఊహించని సంఘటన ఎదురైంది. ఓ వ్యక్తి ఆ మహిళా జర్నలిస్టు నడుముపై కొట్టి వెళ్లిపోయాడు. ఈ పరిణామంతో ఆమె షాక్ అయింది. అయినప్పటికీ తన లైవ్ కవరేజ్ ను కొనసాగించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
https://twitter.com/wsavalexb/status/1203372986948112391
శుక్రవారం ఓ వార్తను కవర్ చేయడానికి వీఎస్ఏవీ టీవీ జర్నలిస్టు అలెక్స్ బోజర్జియాన్ జార్జియాలోని సవ్హానా ప్రాంతంలోకి వెళ్లింది. ఓ బ్రిడ్జి వద్ద జరుగుతోన్న కార్యక్రమ విశేషాలను ఆమె లైవ్ లో చెబుతోంది. కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ‘రన్ ర్యాలీ’లో పాల్గొన్న పలువురు టీవీలో కనపడాలన్న ఉత్సాహంతో మహిళా జర్నలిస్టు వెనుక నుంచి ‘హాయ్’ చెబుతూ వెళ్లారు. లైవ్ లో తాను వార్తలు ఇస్తుండగా ఓ వ్యక్తి సడన్ గా ఆమె దగ్గరికి వచ్చి నడుముపై కొట్టి వెళ్లిపోయాడు. ఈ చర్యతో ఒక్కసారిగా షాక్ కి గురైన ఆమె.. లైవ్ కవరేజ్ ను కొనసాగించింది. ఈ చర్యకు పాల్పడిన వ్యక్తిని గుర్తించిన పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇప్పటి వరకు దీన్ని 11 మిలియన్ల మంది చూశారు. వేలాది మంది కామెంట్లు చేశారు.
ఇటీవల అమెరికాలో సారా రివస్ట్ అనే మహిళా జర్నలిస్టు లైవ్ లో ఇస్తుండగా..ఓ వ్యక్తి ఆమెను ముద్దుపెట్టిన సంగతి తెలిసిందే. అయినా ఆమె మాత్రం తన రిపోర్టింగ్ ఆపకుండా కొనసాగించారు. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు సదరు వ్యక్తిని అరెస్ట్ చేసి అతనిపై లైంగిక వేధింపుల కేసు పెట్టారు.