టాప్ స్టోరీస్

డ్రోన్ ద్వారా కిడ్నీ రవాణా

Share

వాషింగ్టన్: డ్రోన్ టెక్నాలజీతో అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఇన్నాళ్లూ ఫొటోలు తీసుకోడానికి, ఎరువులు చల్లడానికి.. ఇలా రకరకాల అవసరాలకు ఉపయోగించిన ఈ డ్రోన్లను ఇప్పుడు ఏకంగా అవయవాల తరలింపునకు కూడా వినియోగిస్తున్నారు. రోజురోజుకీ ఈ టెక్నాలజీ ఎంతో ప్రాచుర్యం పొందుతోంది. సాధారణంగా రోడ్డు మార్గంలో అవయవాలను తరలించాలంటే చాలా ఎక్కువ సమయం పడుతుంది. గ్రీన్ కారిడార్ ఉన్నా ప్రయాణ సమయం చాలానే ఉంటుంది. అదే కొన్ని వందల కిలోమీటర్ల నుంచి అవయవాలను పంపాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. విమానాలు లేదా హెలికాప్టర్లు అందుబాటులో లేకుండా, ట్రాఫిక్ రద్దీగా ఉన్న ప్రాంతాల్లో అయితే చాలా కష్టం. ఇలాంటి పరిస్థితుల్లో డ్రోన్ టెక్నాలజీతో పని చాలా సులభం అవుతోంది.

ప్రపంచంలో తొలిసారిగా డ్రోన్ సాయంతో కిడ్నీని డెలివరీ చేశారు. 8 ఏళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న మేరీలాండ్ లోని బాల్టిమోర్ నగరానికి చెందిన 44 ఏళ్ల మహిళకు ఏప్రిల్ 19న కిడ్నీ మార్పిడిని విజయవంతంగా పూర్తి చేసినట్టు యూనివర్శిటీ ఆఫ్ మేరీలాండ్ మెడికల్ సెంటర్ వెల్లడించింది. ఇందుకు గాను ఆ డ్రోన్ 400 అడుగుల ఎత్తున ఎగురుతూ 5 కిలోమీటర్ల దూరాన్ని పది నిమిషాల్లో చేరుకుని కిడ్నీ అందించింది. వారం క్రితమే కిడ్నీ మార్పిడి అనంతరం మహిళను డిశ్చార్జి చేసినట్టు యూఎంఎంసీ తెలిపింది. ఇందుకు గాను కిడ్నీని దాత నుంచి గ్రహీత వరకు తరలించడానికి ఎంతోమంది సర్జన్లు, ఇంజినీర్లు, ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్, అవయవాలను సేకరించే స్పెషలిస్టులు, పైలట్లు, నర్సులు ఇలా ఎందరో సహకారించారు. వాళ్లంతా కలిసి మహిళకు కిడ్నీ మార్పిడి ఆపరేషన్ ను విజయవంతంగా పూర్తి చేశారు.

ఈ మహిళకు కిడ్నీ పంపిన డ్రోన్ కు.. హ్యుమన్ ఆర్గాన్ మానిటరింగ్ అండ్ క్వాలిటీ అస్యూరెన్స్ అప్పారటస్ ఫర్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ (హోమల్) అని పరిశోధకులు పేరు పెట్టారు. ఈ డ్రోన్ ను అవసరాన్ని బట్టి దూరం నుంచి కూడా గమనించుకునే వీలుండేలా రూపొందించారు. అలాగే, లోపల తరలిస్తున్న అవయవం పరిస్థితి ఎలా ఉందో కూడా ఈ డ్రోన్ సిగ్నల్స్ ద్వారా సమాచారం అందించేలా డిజైన్ చేశారు. ఎఫ్ఏఏ నిబంధనలకు అనుగుణంగా ఉండేలా ఈ డ్రోన్ సిద్ధమైంది. ఈసారి అవసరమైతే 30 లేదా వంద మైళ్ల దూరం కూడా డ్రోన్ వెళ్లేలా చూస్తామని అంటున్నారు.

డ్రోన్ డెలివరీ ప్రారంభంలో పరిశోధకులు ముందుగా పరిమితంగానే కొన్ని రకాల పదార్థాలను పంపేవారు. సెలైన్లు, రక్తం ప్యాకెట్ల లాంటి వాటిని పంపారు. కానీ, ఏకంగా మనిషి కిడ్నీని డ్రోన్ ద్వారా పంపడం మాత్రం ఇదే తొలిసారి అని పరిశోధకులు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి అవయవాలను సులభంగా పంపేందుకు డ్రోన్ టెక్నాలజీ ఎంతో ఉపకరిస్తుందని వైద్యులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఎఫ్ఏఏ.. గూగుల్ వింగ్ సర్వీసు డ్రోన్ డెలివరీ టెక్నాలజీని సర్టిఫై చేసింది. 2016లో ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ కూడా తొలి ప్యాకేజీని డ్రోన్ టెక్నాలజీతో విజయవంతంగా డెలివరీ చేసింది.


Share

Related posts

‘లోకేష్‌కి రాజకీయ భిక్ష పట్టింది వైఎస్సే’!

Mahesh

తమిళనాడులో మోదికి నిరసన సెగ

somaraju sharma

‘జెడి’ హిట్ కొడతారా!

somaraju sharma

Leave a Comment