గన్నవరంలో రగిలిపోతున్న వర్గాలు..! బోగస్ అంటున్న వంశీ..!!

 

(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)

“151 మంది ఎమ్మెల్యేలు ఉండగా ఇంకా ఎమ్మెల్యేలను చేర్చుకోవాల్సిన అవసరం జగన్ ఏమిటి..? పదేళ్ల పాటు పార్టీ జండాను మోశాం..! ఇప్పుడు అధికారం అనుభవించకుండా కేసులు ఎదుర్కొంటున్నాం..! జగన్ ను బూతులు తిట్టాలని ఉంది, కంట్రోల్ చేసుకుంటున్నాం, పార్టీ మీద అభిమానం పూర్తిగా చచ్చిపోయింది” ఈ మాటలు అన్నది ఎవరో కాదు. గన్నవరం నియోజకవర్గం తేలప్రోలు ప్రాంతానికి చెందిన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త. ఆయన పార్టీ కేంద్ర కార్యాలయం కాల్ సెంటర్ లోని పార్టీ నాయకుడితో మాట్లాడుతూ తన ఆవేదనను వ్యక్తం చేశారు. వల్లభనేని వంశీ పార్టీలో చేరడం వల్ల పార్టీ ఎంతగా బాధపడుతుందో, పార్టీ కార్యకర్తలు ఎంతగా ఇబ్బంది పడుతున్నారో తెలియజేస్తూ ఆయన మాట్లాడిన ఆడియో రికార్డు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.


పాయింట్ లు ఉన్నాయి.. అతిశయోక్తి ఉంది

“నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలు అందరూ టీడీపీలోకి వెళ్ళాలని చూస్తున్నారు. టీడీపీలో గతంలో వంశీతో ఉన్న వాళ్ళు ఇప్పుడు పెత్తనం చేస్తున్నారు. అంటే పదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉన్న మేము ఇప్పుడు కూడా ప్రతిపక్షానికే పరిమితం అయ్యాము” అని సోషల్ మీడియా కార్యకర్త మాటల్లోంచి సారాంశం వస్తోంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కల్గిస్తోంది. గన్నవరంలో వల్లభనేని వంశీ వైసీపీలో చేరిన తరువాత వర్గాలు పెరిగి తీవ్రంగా వైసీపీలో వ్యతిరేకత వ్యక్తం అవుతోందని వార్తలు వస్తున్న తరుణంలో ఈ ఆడియో క్లిప్ బయటకు రావడం అతి పెద్ద చర్చనీయాంశంగా మారింది. నాలుగు నిమిషాల పాటు ఉన్న ఈ ఆడియో క్లిప్ లో సంచలన విషయాలతో పాటు కొన్ని అతిశయోక్తులు కూడా ఉన్నాయి. మొత్తానికి కేంద్ర కార్యాలయం నుండి ఫోన్ చేసిన ఆ నాయకుడు ఎవరు. తేలప్రోలు మండలం నుండి మాట్లాడిన ఈ కార్యకర్త ఎవరు అనేది తెలియదు కానీ వైసీపీ అంతర్గత విషయాాలు మాత్రం రచ్చకెక్కాయి అనేది మాత్రం వాస్తవం.

అంతా బోగస్ అంటున్న వంశీ వర్గం

మరో వైపు ఈ ఆడియో క్లిప్, విభేదాల విషయంపై వల్లభనేని వంశీ వర్గం కూడా దృష్టి పెట్టింది. ఇదంతా బోగస్ అని, తెలుగు దేశం పార్టీ వాళ్ళే ఇలా క్రియేట్ చేసి వదులుతున్నారని వంశీ మద్దతు దారులు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఇద్దరు వాళ్ళకు వాళ్ళు మాట్లాడుకుని అలా సృష్టించి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారనీ, గన్నవరం నియోజకవర్గంలో చిన్న చిన్న వర్గాభిప్రాయాలు ఉన్నప్పటికీ అందరూ కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు అనేది వంశీ వర్గం వాదన. మొత్తానికి గన్నవరం నియోజకవర్గం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. రాజీనామా చేసి ఉప ఎన్నికలకు సిద్ధమే అని సవాాల్ చేస్తున్న వల్లభనేని వంశీకి ఇటువంటి తలనొప్పులు ఎక్కువైపోతున్నాయి. రెండు వారాల క్రిందట ఇరువర్గాలు కొట్టుకుని పోలీస్ స్టేషన్ వరకూ వెళ్ళాయి. అంతకు ముందు కూడా ఏదో విషయంపై ఘర్షణ పడ్డారు. తాజాగా ఈ ఆడియో క్లిప్ వివాదం. ఇలా వంశీకి ప్రశాంతత లేకుండా మరో వైపు దుట్టా రామంచ్రదరావు, యార్లగడ్డ వెంకట్రావులకు కూడా ప్రశాంతత లేకుండా గన్నవరం రాజకీయాలు తయారు అయ్యాయి. దీని అంతటికి కారణం ఎవరంటారు?.