ఆర్మీ చీఫ్ నోట రాజకీయాలా!?

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)

న్యూఢిల్లీ: ఆర్మీ చీఫ్ రాజకీయాలు మాట్లాడవచ్చా. పౌరసత్వం సవరణ చట్టం (సిఎఎ)కు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలపై  ప్రస్తుత సైనికదళాల ప్రధానాధికారి జనరల్ బిపిన్ రావత్ గురువారం చేసిన వ్యాఖ్యల కారణంగా ఈ వివాదం తలెత్తింది. జనరల్ రావత్‌ హద్దులు మీరారంటూ విమర్శలు వచ్చాయి.

నాయకులంటే జనాన్ని హింసాకాండకూ, విధ్వంసానికీ నడిపించే వారు కాదు అని జనరల్ రావత్ వ్యాఖ్యానించారు. జాతీయ పౌరుల జాబితా (ఎన్ఆర్‌సి)కూ, సిఎఎకూ వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా చెలరేగిన నిరసన ప్రదర్శనలపై జనరల్ రావత్ స్పందించడం ఇదే మొదటిసారి. ఈ ప్రదర్శనల సందర్భంగా చోటు చేసుకున్న హింసాకాండలో కనీసం 20 మంది మరణించారు. వారిలో ఎక్కువమంది ఉత్తరప్రదేశ్‌లోనే మృతి చెందారు.

నిరసన ప్రదర్శనల్లో ప్రభుత్వ ఆస్థుల విధ్వంసాన్ని ప్రధాని నరేంద్ర మోదీ కూడా నిన్న ఖండించారు. జనరల్ రావత్ వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్ అధికార ప్రతినిధి బ్రిజేష్ కలప్ప, జనరల్ రావత్ సిఎఎ నిరసనలపై మాట్లాడడం రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. ఇవాళ రాజకీయ అంశాలపై మాట్లాడనిస్తే రేపు దేశాన్ని సైన్యం హస్తగతం చేసుకోనివ్వాల్సి వస్తుంది అని పేర్కొన్నారు.

మజ్లిస్ నేత అసదుద్దీన్ ఒవైసీ స్పందిస్తూ, నాయకుడంటే తన ఉద్యోగం పరిమితులు ఎరిగిన వాడు. పౌర సమాజం నుంచి వచ్చే ప్రభుత్వం అధికారాన్ని గుర్తెరిగేవాడు అని వ్యాఖ్యానించారు. జనరల్ రావత్ ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్నారు.