ఎమ్మెల్యే రాజయ్యకు గోరుముద్దలు!

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

స్టేషన్ ఘన్‌పూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య మరో వివాదంలో చిక్కుకున్నారు. ఓ పదో తరగతి అమ్మాయి గోరుముద్దలు పెడుతుంటే.. ఆయన ఎంచక్కా ఫొటోలకు ఫొజులిస్తూ ఆరగించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. జనగాం జిల్లాలోని చేల్పూర్ జిల్లా పరిషత్ పాఠశాలలో జరిగిన ఓ కార్యక్రమానికి ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య హాజరయ్యారు. అక్కడ భోజనాల సందర్భంగా ఓ పదో తరగతి విద్యార్థిని ఓ ప్లేట్‌లో అన్నం, కూరలు వేసుకుని వచ్చి, వాటిని కలిపి ఎమ్మెల్యేకు గోరుముద్దలు తినిపించింది. ఆ పక్కనే మరో పదో తరగతి అబ్బాయి రాజయ్య కోసం వాటర్ బాటిల్ పట్టుకుని ఉన్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారడంతో తాటికొండ రాజయ్య మీద నెటిజన్లు విమర్శలు గుప్పించారు.

దీంతో ఈ ఘటనపై ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య స్పందించారు. పాఠశాల ఫంక్షన్‌కు వెళ్లిన తనకు.. ఆ బాలిక ‘అంకుల్ నేనే మీకు తినిపిస్తాను అంటూ ఆమే గోరుముద్దలు కలిపి పెట్టింది. నేను తరచుగా ఆ స్కూల్‌కి వెళ్తూ ఉంటా. ఆ అమ్మాయి నా కూతురు లాంటిది. అందులో తప్పేముంది. సోషల్ మీడియాలో కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు’ అని రాజయ్య వివరణ ఇచ్చారు.