టిక్‌టాక్ పిచ్చి.. బస్సు ఆపి స్టెప్పులు!

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

టిక్ టాక్ మోజు.. చాలా మందితో వెర్రివేషాలు వేయిస్తుంది. తాజాగా పూణేలో ఓ యువతి చేసిన హంగామా అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సును ఆపి యువతి అత్యుత్సాహాం ప్రదర్శించింది. మహానగర్‌లో హడప్సర్ – బైక్రేయినగర్ మార్గంలో ఓ అమ్మాయి టిక్ టాక్ డ్యాన్స్ విమర్శలకు దారి తీసింది. ఏకంగా ఎలక్ట్రిక్ బస్సును రోడ్డుపై ఆపి దాని ముందు ‘చలో ఇష్క్ లడాయెన్’ అనే హిందీ పాటకు స్టెప్పులేసింది. ఆమె డ్యాన్స్ చేసే సమయంలో బస్సులో ఉన్న ప్రయాణికులు ఏం జరుగుతుందో తెలియక యువతి చర్యను అంతా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు. ఆ సమయంలో కొంత సేపు ట్రాఫిక్‌కు ఇబ్బంది కూడా కలిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఈ వీడియో చూసిన వారంతా సదరు యువతి తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. పిచ్చి ప్రయత్నాలకు ప్రజలను ఇబ్బంది పెట్టడం దేనికంటూ ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ట్రాఫిక్ కు అంతరాయం కలిగించినందుకు ఆ యువతిపై కేసు నమోదు చేసినట్లు పుణే సిటీ పోలీసులు తెలిపారు.

ఇది ఇలా ఉంటే.. టిక్ టాక్ మోజులో పడి పలువురు ప్రమాదకరంగా విన్యాసాలు చేస్తుండగా..మరికొందరు తమ చేష్టలతో ఇతరులను ఇబ్బందులు కలిగిస్తున్నారు. లైకులు, ఫాలోవర్ల కోసం చాలా మంది రకరకాల  ఫీట్లు చేస్తున్నారు. ఎవరి బాధతో మాకేంటి అన్నట్టుగా కేవలం టిక్ టాక్ వీడియో చేడయంపైనే దృష్టిపెడుతున్నారు. కొన్నిసార్లు ఈ  సరదా వారి ప్రాణాలమీదకు కూడా తెస్తుంది. అయినా వీరిలో మాత్రం మార్పురావడంలేదు.