ఎన్నికల సంఘంపై సందేహం వద్దు: ద్వివేది

అమరావతి,మార్చి 5 : ఐటి గ్రిడ్స్‌ సంస్థకు వెళ్లిన ఓటరు జాబితా అందరికీ అందుబాటులో ఉండేదనని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి జీకే ద్వివేది స్పష్టంచేశారు. పబ్లిక్‌ డొమైన్‌లో ఉండే వివరాలు ఎవరైనా తీసుకొనే వీలుందని ఆయన అన్నారు. రాజకీయ విమర్శలతో తమకు సంబంధం లేదని, ఎన్నికల సంఘానికి దురుద్దేశాలు అపాదించడం సరికాదని ద్వివేది తెలిపారు.

ఓటరు జాబితాలో ఆధార్‌, బ్యాంకు ఖాతా లింకు సమాచారం ఉండదని, ఇతర సంక్షేమ పథకాల సమాచారం కూడా ఏదీ ఉండదని ద్వివేది స్పష్టంచేశారు. నిబంధనల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామనీ, ఎన్నికల ఉద్యోగులు తప్పుచేసినా క్రిమినల్‌ చర్యలతో పాటు సస్పెండ్‌ చేస్తున్నామని ద్వివేది అన్నారు.

ఎన్నికల సంఘం పని తీరు మీద సందేహాలు వద్దనీ, ప్రతి దరఖాస్తునూ పరిశీలించాకే ఓట్ల తొలగింపు ఉంటుందని ప్రధాన ఎన్నికల అధికారి ద్వివేది స్పష్టం చేశారు.

ఏకపక్షంగా ఓట్లు ఎక్కడ తొలగించామో నిరూపించాలని ద్వివేది అన్నారు. ఓట్లు తొలగించాలంటూ తప్పుడు దరఖాస్తులు పెట్టిన వారిపై ఇప్పటివరకు వందకు పైగా కేసులు నమోదైనట్టు ద్వివేది తెలిపారు. కేసులు నమోదు కావడంతో ఫారం 7 దరఖాస్తులు గణనీయంగా తగ్గిపోయాయన్నారు.

ఐటీ గ్రిడ్ వ్యవహారంలో ఓటర్ల జాబితా ఎక్కడ నుంచి వచ్చిందో తెలంగాణ కమిషనర్ సజ్జనార్ చెప్పాలని ద్వివేది పేర్కొన్నారు. ఎడిట్ చేయలేని ఓటర్ల జాబితా మాత్రమే ఈసీ విడుదల చేసిందని ఆయన స్పష్టం చేశారు.