(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
పర్యావరణ పరిరక్షణ కార్యకర్త గ్రేటా తున్బెర్గ్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వేపు చూసిన చూపు ఇంటర్నెట్లో ఇప్పుడు లేటెస్ట్ సెన్సేషన్. ఆ చూపుకే గనుక శక్తి ఉంటే ట్రంప్ భస్మీపటలం అయి ఉండేవాడు. స్వీడిష్ టీనేజర్ గ్రేటా తున్బెర్గ్ ఐక్యరాజ్య సమితి పర్యావరణ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు న్యూయార్క్ వచ్చింది.
తున్బెర్గ్ బయటకు వెళుతుండగా అదే సమయంలో ట్రంప్ లోపలికి వచ్చారు. ఆయన కోసం తున్బెర్గ్ కొద్ది సేపు పక్కన ఆగాల్సి వచ్చింది. ఆ సమయంలో ఆమె పెదవులు బిగించి తీక్షణంగా ట్రంప్ వైపు చూస్తుండడం వీడియో కెమేరాలో రికార్డయింది.
ట్రంప్ భూతాపం సిద్ధాంతాన్ని నమ్మరు. వాతావరణంలో కలిసే కర్బన వాయువుల తగ్గింపు లక్ష్యాలను నిర్దేశిస్తున్న పారిస్ ఒప్పందంపై బరాక్ ఒబామా హయంలో అమెరికా సంతకం చేసింది. ట్రంప్ అధ్యక్షుడుగా గెలిచిన తర్వాత అమెరికాను పారిస్ ఒప్పందం నుంచి ఉపసంహరించారు.
ట్రంప్ నిన్న తున్బెర్గ్ను ట్విట్టర్లో అవహేళన చేశారు. సమితిలో ఆమె ప్రసంగం వీడియోను పోస్టు చేసి, ఈమె చక్కటి భవిష్యత్తు కోసం చూస్తున్న మంచి అమ్మాయిలా కనబడుతోంది. సో నైస్ టు సీ అని ట్వీట్ చేశారు. దానిపై నెటిజెన్లు మండిపడ్డారు. పర్యావరణం పరిరక్షణ కోసం కృషి చేస్తున్న 16 ఏళ్ల బాలికపై అమెరికా అధ్యక్షుడు వ్యంగ్యం కుమ్మరించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు.
నిన్నటి ప్రసంగంలో తున్బెర్గ్ ప్రపంచ దేశాల నాయకులను తూర్పార పట్టింది. ఒకపక్క పర్యావరణం నాశనమౌతుంటే ఎవరూ పట్టించుకోకపోవడాన్ని ప్రశ్నిస్తూ, ఎంత ధైర్యం మీకు అని పదేపదే నిలదీసింది. ఈ సమావేశం కోసం ఆమె రెండు వారాల పాటు ఒక రేసింగ్ బోటులో అట్లాంటిక్ మహాసముద్రాన్ని దాటి న్యూయార్క్ వచ్చింది.