తెలంగాణలో మరో దారుణ పరువు హత్య

తెలంగాణలోని మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగులో దారుణం చోటు చేసుకుంది. కొంతకాలం కిందట అనూరాధ అనే యాదవ కులానికి చెందిన యువతి, అదే గ్రామానికి చెందిన పద్మశాలి కులస్థుడైన లక్ష్మణ్ అనే వ్యక్తిని ప్రెమించి పెళ్ళి చేసుకుంది. హైదరాబాద్ ఆర్యసమాజ్‌లో అనూరాధ- లక్ష్మణ్ వివాహం చేసుకున్నారు. పెళ్ళి చేసుకొని కొత్త దంపతులు హైదరాబాద్ నుండి కలమడుగుకు తిరిగి వచ్చారు. తమకు ప్రాణహాని ఉందని  పోలీసులను ఆశ్రయించి గ్రామానికి వెళ్ళారు.

అంతలోనే అనూరాధ తల్లిదండ్రులు వారిపై దాడికి తెగబడ్డారు. కూతురు అనూరాధను కొట్టుకుంటూ తీసుకెళ్లారు. ఆ రాత్రి తల్లిదండ్రులతో పాటు ఆరుగురు కలిసి అనూరాధ గొంతు నులిమి దారుణంగా హత్య చేశారు. ఆ తర్వాత మృతదేహాన్ని కాల్చి బూడిద చేసి, ఆ బూడిదను పంట పొలాల్లో కలిపేశారు.  అనూరాధపై జరిగిన దాడిపై భర్త లక్ష్మణ్ పోలీసులకు సమాచారం అందించారు. కానీ అప్పటికే అనూరాధను తల్లిదండ్రులు చంపేశారు. రెండు కుంటుంబాల పెద్దలు ఎవరూ గ్రామంలో అందుబాటులో లేరు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కన్నతల్లిదండ్రులే కసాయిలై పరువు పేరుతో పైశాచికంగా కన్నబిడ్డను పొట్టన పెట్టుకున్న ఈ విదారక ఘటన అందరినీ కలచివేసింది. ఇటీవలే నల్గొండ జిల్లాలో మారుతీ రావు అనే కసాయి తండ్రి కన్న కూతురి భర్తనే సుపారీ ఇచ్చి మరీ అంతం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఈ పరువు హత్య నెత్తుటి తడి ఆరకముందే అలాంటిదే మరో కిరాతకం జరగడం పట్ల సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమౌతున్నాయి.