హోదా హామీ నేరవేర్చాల్సిందే: కమిటీ

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇవ్వాలన్నయుపిఎ ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేయాల్సిందేనని హోంశాఖ వ్యవహారాల పార్లమెంటరీ స్థాయీ సంఘం ముసాయిదా నివేదికలో సిఫారసు చేసినట్లు తెలిసిందని ఇండియన్ ఎక్స్‌ప్రెస్  దినపత్రిక రిపోర్టు చేసింది.

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా కల్పిస్తామని అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ లోక్‌సభలో ఇచ్చిన హామీని గౌరవించాల్సిందేనని కమిటీ పేర్కొన్నది. ముసాయిదా నివేదిక ప్రతులు ఈ రోజు ఉదయమే సభ్యులకు పంపిణీ చేశారనీ, వారు దాని పరిశీలనకు సమయం కోరారనీ అభిజ్ఞ వర్గాల ద్వారా తెలిసినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పేర్కొన్నది. రెండు వారాల్లో కమిటీ మరోసారి సమావేశం అయినపుడు నివేదికను ఆమోదించే విషయం పరిశీలనకు వస్తుందని ఆ వర్గాలు తెలిపాయి.

ప్రత్యేకహోదా విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం నవ్యాంధ్రను వంచిస్తున్నదని ఆరోపిస్తూ టిడిపి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం పోరాడుతున్నది. ప్రత్యేకహోదా అన్నది నవ్యాంధ్రలో ప్రజా సెంటిమెంట్‌గా మారింది. ఈవిషయంలో రాష్ట్రంలోని అన్ని పార్టీలదీ, ప్రజాసంఘాలదీ ఒకే వైఖరి అయినప్పటికీ ప్రధాన ప్రతిపక్షం అయిన వైసిపి, మరో రాజకీయపక్షం జనసేన ప్రభుత్వ పోరాటంలో కలిసిరావడం లేదు. తాజాగా ముఖ్యమంత్రి ప్రత్యేకహోదా పోరాటాన్ని దేశ రాజధాని వీధుల్లోకి తీసుకువెళ్లారు.