డొరియన్ పెను తుపాను కన్ను ఇది. దీని శక్తిని బట్టి డొరియన్ను కాటగిరీ 5 తుపానుగా వర్గీకరించారు
(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
అట్లాంటిక్ మహా సముద్రంలో ప్రచండమైన శక్తిని సంతరించుకుని నింపాదిగా అమెరికా వైపు కదులుతున్న తుపాను డొరియన్ ఆదివారం రాత్రి దారిలో ఉన్న బహామా దీవులపై విరుచుకుపడింది. కాటగిరీ 5 తుపానుగా దీనిని వర్గీకరించారు. అమెరికాలోని ఫ్లారిడా తీరం వైపు ఈ తుపాను పయనిస్తోంది. డొరియన్ను పెనువిపత్తుగా అభివర్ణిస్తున్నారు.
గంటకు 350 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న పెనుగాలులు బహామా దీవులను అల్లకల్లోలానికి గురి చేశాయి. అబాకో దీవిలో ఒక బాలుడు మృతి చెందాడు. మరో బాలిక గల్లంతయింది. తుఫాన్లను నమోదు చేయడం మొదలుపెట్టిన తర్వాత బహామా దీవులు ఇంత పెద్ద తుపానును ఎప్పుడూ చూడలేదు.
డొరియన్ కదులుతున్న తీరును బట్టి దీని దారిని వాతావరణ శాస్త్రజ్ఞులు ఖచ్చితంగా ఊహించలేకపోతున్నారు. నెమ్మదిగా కదలుతున్నందు వల్ల ఇది మరింత శక్తి సంతరించుకుంటోంది. దీనివల్ల బహామా దీవులు ఇప్పటికే ఎక్కువ దెబ్బ తిన్నాయి కానీ జనసాంద్రత ఎక్కువ ఉండే అమెరికా తీరాన్ని తాకినపుడు జరిగే నష్టం గురించి అందరూ భయపడుతున్నారు.
జార్జియా, దక్షిణ కరోలీనా రాష్ట్రాలు తీర ప్రాంతవాసులకు ఇళ్లు ఖాళీ చేయాలన్న హెచ్చరిక జారీ చేశాయి. బహామా దీవుల్లో తీరప్రాంత ప్రజలు సహాయ శిబిరాల్లో తలదాచుకున్నారు. చాలాచోట్ల సముద్ర జలాలు సాధారణం కన్నా 20 మీటర్లు ఎక్కువ ఎత్తులో ఎగసిపడుతున్నాయి. ప్రచండ వేగంతో వీచిన గాలులకు ఇళ్ల కప్పులు లేచిపోయాయి. కరంటు స్తంభాలు నేలకొరిగాయి. కార్లు, ఇతర వాహనాలు కొట్టుకుపోయాయి.
Video Courtesy: The Guardian