నా కుటుంబం వేధిస్తోంది: బీజేపీ నేత కూతురి ఆరోపణ!

భోపాల్: ఇంట్లోంచి వెళ్లిపోయి ప్రేమ వివాహం చేసుకోవాలని అనుకున్న 28 ఏళ్ల ఓ యువతి తనకు ప్రాణ హాని ఉందంటూ..బీజేపీ మాజీ ఎమ్మెల్యే అయిన తన తండ్రిని ఉద్దేశించి సోషల్ మీడియాలో పెట్టిన వీడియో తెగ వైరల్‌ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ కు చెందిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే సురేంద్రనాథ్ సింగ్ కుమార్తె భారతి సింగ్ ని..ఓ రాజకీయ నాయకుడి కొడుకుతో వివాహం చేయాలని నిర్ణయించారు. అయితే ఈ పెళ్లి విషయంపై ఆమెపై కుటుంబసభ్యులు ఒత్తిడి చేశారు. దీంతో ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయింది. అయినా  ఆమెను వేధిస్తూనే ఉన్నారు. భారతి సింగ్ మానసికంగా, బలహీనంగా ఉందని నిరూపించడానికి ఆమె కుటుంబం తప్పుడు పత్రాలతో ప్రచారం చేస్తోంది. దీంతో భారతి తన కుటుంబం నుంచి రక్షణ కోరుతూ హైకోర్టును ఆశ్రయించింది.

అక్టోబర్ 16న తన కూతురు కనిపించడం లేదంటూ భారతి తండ్రి, బీజేపీ మాజీ ఎమ్మెల్యే సురేంద్రనాథ్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె మానసిక స్థితి బాగోలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే, తన తండ్రి వాదనను భారతి ఖండించింది. తన మానసిక స్థితిపై తప్పుడు పత్రాలు సృష్టించి ప్రచారం చేస్తున్నారని ఆమె ఆరోపించింది. తనకు మళ్లీ ఇంటికి వెళ్లడం ఇష్టం లేదని తెలిపింది. ఇంటిని విడిచిపెట్టిన తర్వాత తాను సురక్షితంగా, సంతోషంగా ఉన్నానని చెప్పింది. తాను క్రిస్టియన్ లేదా ముస్లిం వ్యక్తితో లేనని స్పష్టం చేసింది. వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేయడాన్ని భరించలేక… తాను ఇంటి నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నానని, ఆ తర్వాతే బయటకు వచ్చానని తెలిపింది. దీనిని కుల, మత సమస్యగా మార్చవద్దని కోరింది. ఈ మేరకు ఓ వీడియోలో ఆమె పేర్కొంది.

ప్రస్తుతం భారతి ఓ ఫిట్ నెస్ సెంటర్లో పనిచేస్తూ..పూణేలో న్యూట్రిషనిస్ట్ కోర్సును అభ్యసిస్తున్నారు. ఆమె వేరే కులానికి చెందిన 33 ఏళ్ల ఓ వ్యక్తిని వివాహం చేసుకోవాలని భావించింది. అయితే, ఈ విషయం ఇంట్లో తెలియడంతో తల్లి అనారోగ్యంగా ఉందని చెప్పి.. భారతిని పూణే నుంచి భోపాల్ కి పిలిపించారు. అనంతరం ఆమెను బలవంతంగా మరో వ్యక్తితో వివాహం చేసేందుకు ప్రయత్నించారని భారతి లాయర్ తెలిపారు.