గుజరాతీ గిరిజన గ్రామాల్లో వింత సంప్రదాయం
పెళ్లి జరగాలంటే పెళ్లికొడుకు, పెళ్లికూతురు తప్పనిసరిగా ఉండాలి కదూ.. కానీ, గుజరాతీ గిరిజన గ్రామాల్లో ఒక విచిత్రమైన సంప్రదాయం ఉంది. అక్కడ పెళ్లికొడుకు లేకుండానే పెళ్లిళ్లు అయిపోయతాయి. అసలు పెళ్లికొడుకు తన సొంత పెళ్లికి హాజరు కాకూడదు. అతడి ఇంట్లో పెళ్లికాని సోదరి లేదా కుటుంబంలో పెళ్లికాని మరెవరైనా ఆడవాళ్లు మాత్రమే పెళ్లికొడుకు స్థానంలో ఉండి పెళ్లి తతంగం అంతా ముగిస్తారు. పళ్లికొడుకు తన తల్లితో కలిసి ఇంట్లోనే ఉండిపోతాడు. అతడి సోదరి బారాత్ (పెళ్లి ఊరేగింపు) తీసుకుని పెళ్లికూతురి ఇంటికి వెళ్లి, ఆమెను పెళ్లి చేసుకుని, మళ్లీ తమ ఇంటికి తీసుకొస్తారు. సాధారణంగా సంప్రదాయం ప్రకారం పెళ్లికొడుకు చేయాల్సిన పనులన్నింటినీ అతడి సోదరి చేస్తుందని, పెళ్లి కూతురికి బదులు ఆమె సోదరుడితో అగ్ని చుట్టూ తిరుగుతుందని సుర్కేఢా గ్రామానికి చెందిన కంజీభాయి రథ్వా చెప్పారు.
ఎప్పుడైనా ఎవరైనా ఈ సంప్రదాయాన్ని ఉల్లంఘిస్తే గ్రామంలో చాలా దురదృష్టకర ఘటనలు జరుగుతాయని సుర్కేఢా గ్రామ పెద్ద రాంసింగ్ భాయ్ రథ్వా తెలిపారు. రెండు సందర్భాలలో కొంతమంది ఈ సంప్రదాయాన్ని పాటించలేదని, అప్పుడు ఆ జంటలు విడిపోవడం లేదా వాళ్ల సంసార జీవితం సరిగా సాకపోవడం, ఇంకా పలు రకాల సమస్యలు తలెత్తాయని అన్నారు. పెళ్లికొడుకు షేర్వానీ ధరించి, తల మీద సఫా (తలపాగా), కత్తి పట్టుకుని ఉన్నా, తన సొంత పెళ్లికి మాత్రం వెళ్లడానికి వీల్లేదు. ఈ విభిన్న సంప్రదాయం గిరిజన సంస్కృతిని ప్రతిబింబిస్తుందని, గిరిజనులు ఎప్పటినుంచో దీన్ని పాటిస్తున్నారని పురోహితులు చెబుతున్నారు. సుర్ఖేడా, సనదా, అంబల్ గ్రామాల్లోని మగ దేవుళ్లు బ్రహ్మచారులుగా ఉంటారని, అందుకే గ్రామస్తులు వారిని గౌరవించడానికి ఇంట్లోనే ఉండిపోతారని అంటున్నారు. అలా చేయడం వల్ల పెళ్లికొడుకులను ఆ దేవుళ్లు చల్లగా చూస్తారన్నది వారి నమ్మకం.