(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
సియాచిన్ ప్రాంతం గురించి వినే ఉంటారుగా! ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన సైనిక స్థావరం సియాచిన్లోనే ఉంది. అక్కడ జీవితం ఎలా ఉంటుందో మనం ఊహించను కూడా ఊహించలేం. సముద్రమట్టానికి 20 వేల అడుగుల ఎత్తున అక్కడ ఉష్ణోగ్రతలు మైనస్ 60 డిగ్రీల వరకూ దిగుతాయి.
అక్కడ పని చేసే సైనికులకు ప్రతి క్షణం సవాలు లాంటిదే. గడ్డ కట్టించే చలిగాలులు జీవితాన్ని నరకంగా మారుస్తాయి. మంచు తుపానులు, మంచు చరియలు విరిగిపడడం వంటి ప్రాణాంతకమైన ప్రమాదాలు సియాచిన్లో చాలా మామూలు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా అపరిమితమైన చలికి కాలి వేళ్లు, చేతి వేళ్లు పనికిరాకుండా పోవడం (ఫ్రాస్ట్ బైట్) కూడా జరుగుతుంది.
సియాచిన్ ప్రాంతంలో జీవితం గురించి దేశ ప్రజలకు కాస్త టేస్ట్ చూపిద్దామనుకున్నారు ముగ్గురు సైనికులు. ప్రధానంగా అక్కడి చలి పరిస్థితులను వివరించే ఒక వీడియో తీసి పంపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
ఇందులో మొదట ఒక సైనికుడు ఒక ప్యాకెట్ విప్పుతాడు. అది జ్యూస్ ప్యాకెట్ అన్నమాట. జ్యూస్ రాయిలాగా ఉంటుంది. సుత్తి పెట్టి కొట్టినా పగలదు. తర్వాత గుడ్లను పగలగొట్టేందుకు సైనికులు విఫలయత్నం చేస్తారు. ఒక సైనికుడు గుడ్డు తీసుకుని బండకేసి గట్టిగా విసురుతాడు. అయినా గుడ్డు పగలదు. గడ్డ కట్టిపోయిన ఉల్లిపాయలు, బంగాళదుంపలు, అల్లం, టమోటాలను కూడా ఇలాగే పగలగొట్టేందుకు సైనికులు ప్రయత్నిస్తారు. ట్విట్టర్లో ఈ వీడియోకు విపరీతమైన స్పందన వచ్చింది.
https://youtu.be/hHI8Ah9j8xE