ఢిల్లీ, మార్చి 10 : మొబైల్ ఫోన్లో పిల్లలకు సంబంధించిన అశ్లీల వీడియోలు డౌన్లోడ్ చేసినందుకు అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో ఒక భారతీయ పైలట్‌ను ఎఫ్బిఐ అధికారులు అరెస్ట్ చేశారు.
న్యూఢిల్లీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకు బయలుదేరి వెళ్లిన పైలట్ అక్కడ విమానాశ్రయంలో విమానాన్ని దించగానే అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రయాణికులందరి ముందు అతనికి సంకెళ్లు వేసి విమానం నుంచి దించేశారు.
అమెరికా ఫెడరల్ చట్టం ప్రకారం పిల్లలకు సంబంధిన అశ్లీల ఫోటోలు గానీ, వీడియోలు గానీ చూడడం లేదా షేర్ చేయడం నేరం. స్నేహితుల ఫోన్లలో అలాంటి అభ్యంతరకర ఫోటోలు, వీడియోలు ఉన్నాయని తెలిసి పోలీసులకు సమాచారం ఇవ్వకపోయినా చట్టరీత్యానేరంగా పరిగణిస్తారు. పిల్లలపై జరుగుతున్న నేరాలను నిరోధించే ఉద్దేశంతో చైల్డ్ పోర్నోగ్రఫీని అమెరికన్ ప్రభుత్వం నిషేధించింది.
ముంబాయికి చెందిన భారతీయ పైలట్ కూడా ఇలాంటి వీడియోలనే ఫోన్లో డౌన్లోడ్ చేసినట్టు గుర్తించిన అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పైలట్ పాస్‌పోర్టును సీజ్ చేసిన అధికారులు.. అతని యూఎస్ వీసాను రద్దు చేశారు. అతను మళ్లీ అమెరికా రాకుండా నిషేధం కూడా విధించారు.
ఉద్యోగరీత్యా అమెరికా వచ్చి వెళ్తుండే ఈ పైలట్‌పై అనుమానం వచ్చిన ఎఫ్బిఐ అధికారులు రెండు నెలలుగా అతని ఇంటర్నెట్ వాడకంపై నిఘా పెట్టారు. చైల్డ్ పోర్న్ వీడియోలు చూస్తున్నాడని నిర్థారణ అవ్వగానే అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అతను అమెరికాకి వచ్చేదాకా ఎదురుచూస్తూ ఉన్న యూఎస్ బ్యూరో ఆఫ్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రోటక్షన్ అధికారులు విమానం ల్యాండ్ అయిన 15 నిమిషాల్లోనే పైలట్‌ను అరెస్ట్ చేశారు.
భారతీయ పైలట్‌ను అరెస్ట్ చేసిన అమెరికన్ అధికారులు అతని ఇంటర్నెట్ వాడకానికి సంబంధించిన సీల్డ్ రికార్డును భారతీయ అధికారులకు పంపించారు.