(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
నదీ జలాల పరిరక్షణ కోసం కావేరీ కాలింగ్ పేరిట ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్ చేపట్టిన ఉద్యమానికి మద్దతు రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా ‘కావేరి కాలింగ్’కు హాలీవుడ్ నటుడు, టైటానిక్ హీరో లియోనార్డో డికాప్రియో తన సంఘీభావాన్ని ప్రకటించారు. ఈ మేరకు ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ పెట్టారు. ‘భారతదేశంలోని నదులు తీవ్ర ప్రమాదంలో ఉన్నాయి. నదుల సంరక్షణ కోసం జగ్గీ చేపట్టిన కావేరి కాలింగ్ కు అందరం మద్దతిద్దాం’అని పోస్ట్ చేశారు. కాగా డికాప్రియోను ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్ గత ఏడాది మన దేశంలోనే జరిగిన ఓ కార్యక్రమానికి ఆహ్వానించారు.
https://www.facebook.com/LeonardoDiCaprio/posts/10156285612532116
భారత్‌లో నదులు కనుమరుగయ్యే పరిస్థితితో ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయని ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్ కావేరీ కాలింగ్ పేరిట ఉద్యమానికి పిలుపునిచ్చారు. దీనికి ప్రపంచ వ్యాప్తంగా అనూహ్య స్పందన లభిస్తోంది. దీనికి మద్దతు పలుకుతూ లక్షల మంది రైతులు కావేరీ నదీతీరప్రాంతంలో 242 కోట్ల మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. మరోవైపు ఈ కార్యక్రమానికి సినిమా తారలు ఎంతోమంది తమ మద్దతును ప్రకటించారు. తెలుగు, తమిళ, హిందీ తదితర భాషాలకు చెందిన సినీ తారలు కావేరి కాలింగ్‌కు తమ సంఘీభావాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.