ఫొటో.. ఎంత పని చేసింది!

జకార్తా: ఫొటో సరదా ఒక్కోసారి ప్రాణాంతకంగా మారచ్చు. ప్రమాదకరమైన ప్రదేశాలలో ఫొటోలు తీయించుకోవడం సరికాదని ఆ అమ్మాయికి బాగా తెలిసొచ్చింది. కొండ అంచున నిలబడి.. వెనక సముద్ర కెరటాలు వస్తుండగా ఫొటో తీయించుకోవాలని ఆమె అనుకుంది. రెండు చేతులూ బార్లా చాపి మరీ ఫొటో తీయించుకుందాం అనుకుంది. అంతలో ఒక్కసారిగా రాకాసి అల వెనక నుంచి వచ్చి ఆమెను విసిరిపారేసింది. ఇదంతా ఇండోనేసియాలోని నుసా లెంబోంగాన్ దీవిలో గల డెవిల్స్ టియర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తులు ఆమె ఫొటో తీయించుకుంటుండగా వెనక కెరటం వస్తున్న వైనాన్ని సెల్ ఫోనులో వీడియోరికార్డు చేశారు. దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, అది కొద్దిసేపటికే వైరల్ అయింది. అప్పటివరకు వీడియోలో కనిపిస్తున్న మహిళ ఉన్నట్టుండి అదృశ్యం కావడంతో ఏమైందోనని అంతా అరుపులు, కేకలు పెట్టారు. ఈ పుటేజిని తొలుత ఫేస్ బుక్ లో పెట్టారని, అక్కడినుంచి పలు చోట్లకు విస్తరించిందని అంటున్నారు.

అయితే, అంత కెరటం వచ్చి మీద పడినా, అదృష్టవశాత్తు ఆ మహిళ స్వల్ప గాయాలతోనే బయటపడింది. ప్రమాదం తర్వాత ఒక వ్యక్తి ఆమెను తన చేతులతో తీసుకెళ్లి చికిత్స చేయిస్తున్నట్లు బాలికి చెందిన ఒక ఇన్ స్టాగ్రామ్ పేజీలో ఉంది. దాంతోపాటే చిన్నపాటి హెచ్చరిక కూడా చేశారు. ‘‘ఈ వీడియోను దయచేసి లైక్ చేసి, షేర్ చేయండి. ఇంత దగ్గరగా నిలబడటం ఎంత ప్రమాదకరమో అందరికీ అర్థమవుతుంది. కాస్త ఆగి.. జాగ్రత్తగా చూసుకోంది. ఇక్కడినుంచి 20 మీటర్లు దూరంగా వెళ్లినా ఈ వ్యూ బాగానే కనిపిస్తుంది’’ అని అందులో రాశారు. డెవిల్స్ టియర్ అనేది ఇండోనేసియాలో ప్రముఖ పర్యాటక ప్రాంతం.