డాన్సింగ్ పోలీస్ రంజిత్ సింగ్ క్రికెటర్ కూడా!

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

డాన్సింగ్ ట్రాఫిక్ కాప్ రంజిత్ సింగ్ గుర్తున్నాడా? ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారిన ఆ డాన్సింగ్ పోలీస్‌కు ఇప్పుడు ఫేస్‌బుక్‌లో లక్ష మంది ఫాలోయర్లు ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 24 వేల మంది ఫాలోయర్లు ఉన్నారు. రెండు కోట్ల  మంది యుట్యూబ్ వ్యూయర్లు ఉన్నారు. ఇంతకీ విషయం ఏమంటే రంజిత్ సింగ్ క్రికెట్ ఆటగాడు కూడా.  మధ్యప్రదేశ్‌ అండర్ 19 టీములో ఆడాడు. ఆ రోజుల్లో అతనిని దక్షిణాఫ్రికా ఫీల్డింగ్ ఎక్స్‌పర్ట్  జాంటీ రోడ్స్ పేరు పెట్టి పిలిచేవారట. “కవర్స్‌లో ఫీల్డింగ్ చేసేవాడిని. బంతి నన్ను దాటి వెళ్లేది కాదు” అంటాడు రంజిత్ సింగ్. ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో గురువారం నుంచి ఇండియా – బంగ్లాదేశ్ టెస్ట్ మ్యాచ్ జరగనున్న సందర్భంగా ఇదంతా బయటకు వచ్చింది.

క్రికెట్ మ్యాచ్ సందర్భంగా రంజిత్ సింగ్‌కు హోల్కర్ స్టేడియం దగ్గర డ్యూటీ వేశారు. అక్కడ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రంజిత్ సింగ్‌ను పలకరించినపుడు  అతని క్రికెట్ నేపధ్యం బయటకువచ్చింది: “డాన్స్, క్రికెట్.. యువకుడిగా ఈ రెండూ నాకు ప్రాణం. అయితే పేద కుటుంబం కావడం మూలాన చివరికి నేను పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగంలో చేరాల్సివచ్చింది. ఒకసారి ఉద్యోగంలో చేరగానే ఇక ఇతర విషయాల గురించి ఆలోచించే తీరిక లేకపోయింది” అంటాడు రంజిత్ సింగ్.

రంజిత్ సింగ్ జీవితాన్ని మార్చిన క్షణం ఏది? అతని మాట్లల్లోనే చెప్పాలంటే: “నా సన్నిహిత మిత్రుడు ఒకరు రోడ్డు ప్రమాదంలో మరణించాడు. తర్వాత ఒక రోజు నాలుగు రోడ్ల జంక్షన్‌లో డ్యూటీ  చేస్తున్నాను. నా మిత్రుడే గుర్తుకు వస్తున్నాడు. మానసిక ఆందోళన తట్టుకోలేక అటూ ఇటూ వేగంగా నడవడం మొదలు పెట్టాను. అది నాకు తెలియకుండానే డాన్స్‌గా మారిపోయింది. అక్కడే ఉన్న నా సీనియర్ బాగుంది కొనసాగించు అన్నాడు. అలా డాన్సింగ్ పోలీసు అయ్యాను”.

Video Courtesy: BBC News

ఇంటర్నెట్ వ్యాప్తి పెరిగిన తర్వాత రంజిత్ సింగ్ పేరు సోషల్ మీడియా పుణ్యమా అని ప్రపంచవ్యాప్తంగా తెలిసింది. జనం అతనిని సూర్య సినిమా పేరుతో ‘సింగం సర్’ అనడం మొదలుపెట్టారు. అతనికి  టెలివిజన్ షోలకు ఆహ్వానాలు రావడం మొదలయింది. ఒక షోలో ఏకంగా అమితాబ్ బచ్చన్‌తో కలిసి పాల్గొన్నాడు. బాలీవుడ్ నుంచి కూడా ఆహ్వానాలు వస్తున్నాయని రంజిత్ సింగ్  చెప్పాడు.

ట్రాఫిక్ పోలీసు ఉద్యోగం చేస్తూనే ఫేమస్ బ్రేక్ డాన్సర్ అవుతానని ఎప్పుడన్నా కలగన్నావా అంటే రంజిత్ సింగ్ ఇచ్చిన సమాధానం ఏమిటో తెలుసా? “నేను నేర్చుకున్న ఒక ముఖ్యమైన పాఠం ఏమంటే మన కల నిజం అయ్యే అవకాశం అసలు ఏమాత్రం ఎదురుచూడని సమయంలో వస్తుంది. అప్పుడు దానిని చటుక్కున పట్టుకోవాలి”.

ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సౌజన్యంతో