కేసీఆర్ ఆర్థిక దన్నుపై కేంద్రం నజర్?

(న్యూస్ ఆర్బిట్ బ్యూర్)

తెలంగాణలో తమకు తిరుగులేదు, తాము చెప్పిందే వేదం అనుకుని రాజకీయం చేస్తున్న సీఎం కేసీఆర్ కి చెక్ పెట్టేందుకు కేంద్రం సిద్దం అయ్యిందా ? కేసీఆర్ ఆర్థిక దన్నును దెబ్బ తీసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందా ? అంటే అవుననే అనిపిస్తోంది. తాజాగా జరుగుతున్న పరిణామాలే ఇందుకు నిదర్శనం. తెలుగు రాష్ట్రాల్లో బ‌డా ఇంజీనీరింగ్ సంస్థ‌గా పేరొందిన మేఘాపై ఐటీ దాడులు జ‌రుగుతున్నాయి. మేఘా ఇంజనీరింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్(మెయిల్) కంపెనీకి సంబంధించి ఐటీ రిటర్న్స్‌పై అధికారుల సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త మేఘా కృష్ణారెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ దాడులు జరుగుతున్నాయి. హైద‌రాబాద్‌ సహా దేశవ్యాప్తంగా 30 చోట్ల ఏక‌కాలంలో ఐటీ అధికారులు దాడులు నిర్వ‌హిస్తున్నారు. మేఘా సంస్థ కార్యాలయాలు, కృష్ణారెడ్డి ఆఫీసు, ఇళ్లతో పాటు ఆయన బంధువులు, కీలక అనుచరుల ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. బినామీ కంపెనీల వివరాలు, పన్ను ఎగవేత అంశాలకు సంబంధించి కీలక ఆధారాలు సేకరిస్తున్నట్లు సమాచారం.

దేశంలో పలు భారీ ప్రాజెక్టులు కాంట్రాక్టులను నిర్వహిస్తోంది మేఘా సంస్థ. తెలుగు రాష్ట్రాల్లో కాళేశ్వరం, పోలవరం లాంటి ప్రాజెక్టులు మేఘా సంస్థే చేపట్టింది. మధ్యప్రదేశ్‌లో ఖార్గోన్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును కూడా మెయిల్ నిర్వహిస్తోంది. మెయిల్ గ్రూప్ కింద మొత్తం 12 కంపెనీలు ఉన్నాయి. విద్యుత్ ఉత్పత్తి, ప్రసారం, నీటిపారుదల, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రవాణా రంగాలలో ఈ కంపెనీ పనిచేస్తోంది. ఇటీవలే తెలంగాణ ఆర్టీసీలో ఎలక్ట్రిక్‌ బస్సుల నిర్వహణ, కొనుగోలులో మేఘా కృష్ణారెడ్డి, మేఘా సంస్థపై అనేక ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. వీటిపై కూడా ఐటి శాఖ అధికారులు ఆరా తీస్తున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్ లకు మేఘా కృష్ణారెడ్డి అత్యంత సన్నిహితుడుగా ఉన్నారు. అతికొద్ది కాలంలోనే వేల కోట్ల రూపాయలు సంపాదించుకొని… భారతీయ సంపన్నుల్లోనే మొదటి 100స్థానాల్లో నిలిచిన మేఘా సంస్థ కార్యాలయాలపై ఐటీ శాఖ ప్రత్యేకంగా దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. ఇంత త్వరగా ఇన్ని వేల కోట్ల రూపాయాల సంపాదన ఎలా సాధ్యమయింది… ఎక్కడెక్కడ మేఘా సంస్థ పనులు చేస్తోంది, ఇప్పటి వరకు చేసిన ప్రాజెక్టుల వివరాలు… సంపాదించిన మొత్తంపై పూర్తి లెక్కలు రాబడుతోంది.

ఇదిలా ఉండగా, ఐటీ సోదాలపై మేఘా కృష్ణారెడ్డి స్పందించారు. తమ ఆఫీసు, ఇళ్లలో ఐటీ సోదాలు జరిగాయని వెల్లడించారు. అధికారులు చేసినవి సోదాలు మాత్రమేనని, దాడులు కాదని ఆయన స్పష్టం చేశారు. గత 20 ఏళ్లుగా సాగుతున్న రెగ్యులర్ సోదాల్లో భాగంగానే తమ ఆఫీసులో, ఇళ్లలో సోదాలు నిర్వహించారని ఆయన స్పష్టం చేశారు. అయితే, హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలోనే సోదాలు జరిగాయని, దేశవ్యాప్తంగా జరగలేదని వివరించారు.

ఇటీవలే హైదరాబాద్‌లో మై హోం రామేశ్వర రావు ఇల్లు, కార్యాలయాలపై కూడా ఐటీ దాడులు జరిగాయి.  టీవీ9 సంస్థలోకి హవాలా మార్గం ద్వారా రామేశ్వర రావు రూ.220 కోట్లను తరలించినట్లు ఆరోపణలు వచ్చాయి. టీవీ9 సంస్థను రామేశ్వర రావు స్వాధీనం చేసుకోవడం, ఛానెల్ నుంచి రవిప్రకాశ్‌ను తప్పించడం వెనుక తెలంగాణ ప్రభుత్వ పాత్ర ఉన్నట్లు వస్తున్న ఆరోపణల నేపథ్యంలోనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రంగంలోకి దిగినట్లు రాజకీయ, మీడియా వర్గాల్లో చర్చించుకుంటున్నారు. మొత్తం మీద తెలంగాణ ప్రభుత్వంపై కేంద్రం నజర్ పెట్టినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో పాగా వేద్దామా అని భావిస్తున్న బీజేపీ.. తెలంగాణలో కేసీఆర్ ఆర్థిక దన్నుగా ఉన్న వారిపై ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే ఐటీ దాడులు మొదలు పెట్టినట్లు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.