అధికారిణిపై దౌర్జన్యం చేస్తే పిటీ కేసా!?

అమరావతి: మహిళా అధికారిణి మీద దౌర్జన్యం చేసిన వైసిపి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలనీ, ఇటువంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలనీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. నాడు వనజాక్షి..నేడు సరళ…ఇరువురూ  ప్రభుత్వ ఉన్నత స్థాయి ఉద్యోగులేననీ, అయినా వీరు ప్రజా ప్రతినిధుల దాష్టీకానికి గురికాక తప్పలేదని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో వున్న మహిళా ఉద్యోగులపైనే ఇలా తెగబడి దాడులు చేస్తుంటే ఇక సగటు మహిళలకు భద్రత ఎక్కడుంటుందదని పవన్ ప్రశ్నించారు. ఎంపిడిఒ సరళపై కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దాడి చేస్తే వైసిపి ఎందుకు ఖండించడం లేదు,శ్రీధర్ రెడ్డిపై తీవ్రమైన చర్యలకు ఎందుకు డిమాండ్ చేయడం లేదని పవన్ ప్రశ్నించారు.

సరళ పెట్టిన క్రిమినల్ కేసును ప్రభుత్వం నిర్వీర్యం చేయడం ద్వారా వైసిపి ప్రభుత్వం ప్రజలకు ఎటువంటి సందేశాన్ని అందచేస్తోందని ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులే చట్టాన్ని గౌరవించకపోతే చట్టానికి విలువ ఎక్కడ నుంచి వస్తుందని పవన్ అన్నారు. ప్రతిపక్ష పార్టీల వారు ప్రజా శ్రేయస్సు కోరి సమస్యలపైన రోడ్డెక్కి నిరసన గళం విప్పితే నాన్ బెయిల్ బుల్ సెక్షన్‌ల కింద కేసులు, ఒక్కోసారి 307 వంటి హత్యాయత్నం కేసులు  కట్టి అరెస్టులు చేస్తున్న పోలీసు యంత్రాంగం ఒక మహిళా ఉద్యోగిపైన దాడి చేసిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై బెయిల్ సులువుగా ఇచ్చే 448, 427, 506, 290 వంటి సెక్షన్‌ల కింద కేసు నమోదు చేయడాన్ని పవన్ తప్పుబట్టారు.

ఈ కేసును పోలీసుల ద్వారా ప్రభుత్వం నీరుగార్చేసిందని పవన్ విమర్శించారు.ఈ సెక్షన్ల కింద నమోదయ్యే కేసులలో స్వల్ప జరిమానా, లేదా నామమాత్రపు శిక్ష విధిస్తారని పవన్ అన్నారు. నిజానికి ప్రభుత్వ అధికారి మీద దాడి చేసిన వారిపై 353, 354 సెక్షన్ల కింద బెయిల్ ఇవ్వడానికి వీలు లేని కేసు పెట్టాల్సి ఉండగా పోలీసులు ఆ పని చేయలేదని పవన్ అన్నారు. దీనికి ప్రభుత్వ ఒత్తిడి కారణమని జనసేన భావిస్తోందని పవన్ పేర్కొన్నారు.