జగన్ వ్యాఖ్యలకు పవన్ రియాక్షన్

అమరావతి: సమస్యను తప్పుదోవపట్టించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తనపై వ్యక్తిగత విమర్శలు చేశారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. జగన్మోహనరెడ్డి చేసిన విమర్శలపై పవన్ కళ్యాణ్ మంగళవారం స్పందించారు. 151 మంది ఎమ్మెల్యేల బలంతో అద్భుతంగా పరిపాలన సాగించే అవకాశం ఉన్న జగన్మోహనరెడ్డి ఒ చిల్లర నాయకుడిలా మాట్లాడటం విడ్డూరంగా ఉందని అన్నారు. తమ తల్లిదండ్రులు సంస్కారం, హుందాతనం పాటించడం నేర్పించాని అందుకే తాను వ్యక్తి గతంగా మాట్లాడటం లేదని అన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టాలంటే ముందుగా అధ్యాపకులను సిద్ధం చేయాల్సిన అవసరం ఉందని పవన్ పేర్కొన్నారు. ముందుగా పైలెట్ ప్రాజెక్టుగా కొన్ని పాఠశాలలు, జిల్లాలలో అమలు చేసిన తరువాత వాటిపై వచ్చిన ఫలితాల ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అలా కాకుండా ఏకపక్షంగా ఇలా నిర్ణయాలను తీసుకోవడం సరికాదని అన్నారు.  తాము హేతుబద్ధంగా మాట్లాడుతుంటే ఇష్టానుసారంగా వ్యక్తిగతంగా మాట్లాడటం ఎంత వరకు పద్ధతని పవన్ ప్రశ్నించారు. కేంద్రంలోని ఒక ప్రధాన నాయకుడు దేశ వ్యాప్తంగా హిందీని అధికార భాషగా నిర్ణయించాలనే అలోచన చేస్తున్నామనడంతో వివిధ రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం కావడంతో హుందా తనంతో ఆ ప్రతిపాదనపై వెనక్కు తగ్గారన్న విషయాన్ని పవన్ గుర్తు చేశారు.

గత ప్రభుత్వంలో కూడా తప్పిదాలపై ఎలుగెత్తి బలంగా మాట్లాడామని అన్నారు. సమస్యలపై గట్టిగా మాట్లాడితే మూడు పెళ్లిళ్లు చేసుకున్నా అంటున్నారు. మీరు కూడా చేసుకోండి ఎవరు వద్దన్నారు అంటూ పవన్ వ్యాఖ్యానించారు.  వైసిపి వారు భాషా సంస్కారాన్ని మర్చి ఎంత హీనంగా మాట్లాడినా తాము ఆ వలలో పడమని అన్నారు. నిన్న సందర్భం ఏమిటి, జగన్ స్థాయి వ్యక్తి మాట్లాడాల్సింది ఏమిటని పవన్ ప్రశ్నించారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు లాంటి నేతలు చేసిన సూచనలను సైతం పట్టించుకోకుండా ఇష్టానుసారంగా చేయాలనుకుంటే భవిష్యత్తు తరాలు క్షమించవని అన్నారు. అంతగా జగన్‌కు ఇంగ్లీషుపై ప్రేమ ఉంటే తిరుపతి లాంటి ఆలయాల్లో సుప్రభాతాన్ని ఇంగ్లీషులో చదివించాలని సూచించారు. జగన్ ఫ్యాక్షన్ ధోరణికి జనసేన భయపడదని పవన్ అన్నారు. సంస్కారాన్ని పక్కన బెడితే తాము వైసిపి వారు రోజు తలెత్తుకొని తిరగకుండా మాట్లాడగలమని పవన్ హెచ్చరించారు.

మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన వీడియో కొరకు కింద క్లిక్ చేయండి….