‘వారి చూపు మావైపే’

అమరావతి: రాష్ట్రంలో దళితులు, ముస్లింలు జనసేన కూటమివైపే చూస్తున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. శుక్రవారం ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో ఆయన మాట్లాడుతూ దళితులు, ముస్లింలు రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వాలో అర్థం కాని పరిస్థితి నెలకొందనీ, వాళ్లు బిజెపి వైపుకు వెళ్లరు, జగన్ వైపుకు వెళ్దామంటే ఆయనేమో బిజెపి, టిఆర్ఎస్ చేతుల్లో కీలుబొమ్మ, టిడిపి వైపుకు వెళ్దామంటే చంద్రబాబు ఎప్పుడు యు టర్న్ తీసుకుని బిజెపికి మద్దతిస్తారో తెలియని భయం ఉందని అన్నారు. అందుకే వాళ్లంతా బిఎస్‌పి, వామపక్షాలు, జనసేనతో కూడిన మా కూటమివైపు చూస్తున్నారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

ఇద్దరు వ్యక్తుల మధ్య కోపాన్ని కోట్లాది మంది ప్రజల మధ్య ధ్వేషంగా ఎందుకు మారుస్తున్నారని పవన్ ప్రశ్నించారు. వైసిపి, టిఆర్ఎస్ రహస్య చర్చలు ప్రజలకు తెలిసిపోయాయని పవన్ అన్నారు. తెలంగాణా సిఎం కెసిఆర్ చంద్రబాబుకు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఆయనకు గిఫ్ట్‌గా మారుతోందని అనిపిస్తుందని అన్నారు. పదేళ్ల పాటు భావోద్వేగాలతోనే గడిచిపోయాయిని, ఇక అటువంటి చర్యలను ఆపాలని పవన్ సూచించారు. చంద్రబాబుకు కెసిఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఆంధ్రకు వచ్చి పోటీ చేయాలి, లేదా జగన్‌తో కలిసి పోటీ చేయాలి అది ప్రజాస్వామ్య పద్ధతి అని పవన్ అన్నారు.

రాజకీయంగా ఉమ్మడి శత్రువు చంద్రబాబును దెబ్బతీయడానికి ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌తో కలిసి పోటీ చేయాలని తెలంగాణ స్నేహితులు కొందరు తనకు చెప్పారనీ, టిడిపీ లేకుండా చేసిన తరువాత మీరిద్దరూ తేల్చుకోవచ్చని సూచించారని అన్నారు. జగన్‌పై ఉన్నఅభిప్రాయాన్ని మార్చుకోలేనని వారికి తెలిపానని పవన్ వివరించారు.

కొంత మంది నేతలు జనసేన పార్టీలో చేరతామని ముందుకు వచ్చిన వారు వైసిపిలోకి వెళ్లారనీ. వీటిపై ఆరా తీస్తే హైదరాబాదులో వారికి ఆస్తులు ఉన్నాయని, వాటితో తమకు సమస్యలు ఉన్నాయని చెప్పారని పవన్ అన్నారు. ఇప్పుడు జరుగుతున్నవి గమనిస్తే అంతా అర్థం అవుతోందని పవన్ పేర్కొన్నారు.

జగన్మోహనరెడ్డి తన బాబాయ్ వివేకానంద రెడ్డి హత్యను ఎందుకు దాచి పెట్టారని పవన్ ప్రశ్నించారు. ఇంట్లో మనిషి హత్యకు గురయితే గోప్యత ఎందుకు పాటించారని పవన్ నిలదీశారు.

ఇవిఎంలపై అనుమానాలు ఉన్న కారణంగా ప్రతి నియోజకవర్గంలో మూడోవంతు వివి ప్యాట్ స్లిప్పులు లెక్కించాలని పవన్ డిమాండ్ చేశారు.