సీఏఏకు మద్దతిచ్చిన పవన్ కళ్యాణ్

విజయవాడ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) తాను సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. విజయవాడలో బీజేపీ నేతలతో సమావేశం ముగిసిన అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, సీఏఏ కారణంగా పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘానిస్థాన్ వంటి దేశాల్లో ఉన్న హిందూ మైనార్టీలకు మేలు జరుగుతుందని అన్నారు. మన దేశంలోని ముస్లింలకు ఈ చట్టం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలిపారు. దీనిపై కొందరు లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారన్నారు. అఖండ భారతంగా ఉన్న దేశం నుంచి పాకిస్థాన్ ఇస్లామిక్ దేశంగా విడిపోయిందన్నారు. ఏ దేశంలో ఉన్న మైనార్టీలను ఆ దేశం సురక్షితంగా చూసుకోవాలి అనే ఒప్పందం పాక్ ఉల్లంఘించిందని ఆరోపించారు. ఆ దేశంలో హిందూవులకు సరైన రక్షణ లేదని పవన్ కళ్యాణ్ చెప్పారు.

పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘానిస్థాన్ వంటి దేశాల్లో ఉన్న హిందూ వెనుకబడిన కులాలు, దళిత కులాలకు చెందిన వారని తెలిపారు. వారిపై దాడులు కూడా జరిగాయని చెప్పారు. పాకిస్థాన్‌లో క్రికెటర్‌గా కొనసాగిన హిందూ వికెట్ కీపర్ విషయంలోనే ఇలాంటి వివక్ష ఉందనే విషయం ఇటీవల పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ వ్యాఖ్యలతో తేలిపోయిందని పవన్ కళ్యాణ్ చెప్పారు. అలాంటి వారికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత భారత్‌పై ఉందని తెలిపారు. పాక్, అప్గాన్, బంగ్లాదేశ్ లలో హిందూ మైనార్టీలను రక్షించడానికి గాంధీ, నెహ్రూ, వామపక్ష నేతలు ఏమి చెప్పారో తెలుసుకోవాలన్నారు. దేశ విభజన తర్వాత ఆ మూడు దేశాల్లో వుండిపోయిన హిందువులు, క్రైస్తవులు, బౌద్దులు, సిక్కులు, జైనులు అక్కడ ఎలాంటి వేధింపులకు గురవుతున్నారో.. ఎలా మత మార్పిడులకు గురవుతున్నారో చాలా మంది మేధావులు బుక్స్ రాశారని చెప్పారు. నాడు మహాత్మ గాంధీ, నెహ్రూ చెప్పిన దానినే నేడు ప్రధాని మోదీ చేస్తున్నారని పవన్ తెలిపారు.

 

video courtesy: AP 24/7