పొట్ట నిండా కొకైన్.. విమానంలోనే మృతి

మెక్సికో సిటీ: డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తే పెద్ద మొత్తంలో డబ్బులు వస్తాయనుకున్నాడు గానీ, అది ప్రాణాలకే ప్రమాదమని గుర్తించలేకపోయాడు. బొగోటా నుంచి టోక్యోకు విమానంలో వెళ్తూ… కడుపులో 246 ప్యాకెట్ల కొకైన్ తీసుకెళ్తున్న జపాన్ పౌరుడు.. ప్రయాణం మధ్యలోనే మరణించాడు. ఉడో ‘ఎన్’ అనే పేరున్న సదరు వ్యక్తి కొలంబియా రాజధాని నుంచి మెక్సికో సిటీకి ప్రయాణించి, జపాన్ వెళ్లే విమానం ఎక్కాడు. ఆ విమానం ప్రయాణం సగంలో ఉండగా అతడికి మూర్ఛలాగా వచ్చింది.

అతడు ఇబ్బంది పడుతున్న విషయాన్ని గుర్తించిన ఫ్లైట్ అటెండెంట్లు సొనోరా లోని హెర్మోసిలోలో అత్యవసర ల్యాండింగ్ కోసం అనుమతి కోరారు. తెల్లవారుజామున 2.25 గంటల సమయంలో విమానం ల్యాండ్ అయిన తర్వాత వైద్యులు విమానంలోకి ఎక్కి, అప్పటికే ఉడో ‘ఎన్’ మరణించినట్లు తెలిపారు. అతడి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించగా, ఒక్కోటీ 2.5 సెంటీమీటర్ల పొడవున్న 246 కొకైన్ ప్యాకెట్లను అతడు మింగినట్లు తేలింది. డ్రగ్స్ మోతాదు బాగా ఎక్కువ కావడంతో మెదడు వాచిపోయి మరణించాడని చెప్పారు.

మృతదేహాన్ని విమానం నుంచి దించి, ఇతర అంతర్జాతీయ ప్రోటోకాల్స్ నిర్వహించిన తర్వాత మరో 198 మంది ప్రయాణికులతో కూడిన విమానం టోక్యోకు తిరుగు ప్రయాణమైంది. గతంలో కూడా ఇలాగే డ్రగ్స్ అక్రమంగా రవాణా చేస్తూ పలువురు ప్రాణాలు కోల్పోయారు.