రెండు సార్లు ప్రమాణం చేసిన ఏపి చీఫ్ జస్టిస్!

 

అమరావతి: రాజ్‌భవన్ అధికారులు చేసిన ఒక చిన్న పొరపాటుకు ఆంద్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రెండు సార్లు ప్రమాణ స్వీకారం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సోమవారం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. అయితే ప్రమాణ స్వీకార పత్రంలో ఆంధ్రప్రదేశ్‌ బదులుగా మధ్యప్రదేశ్ అని రాసి ఉంది. దీంతో గవర్నర్, ప్రధాన న్యాయమూర్తి ఇద్దరూ మధ్యప్రదేశ్ అనే చదివారు. వెంటనే జరిగిన పొరపాటును అధికారులు గ్రహించి విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లడంతో ఆంధ్రప్రదేశ్ అంటూ ప్రధాన న్యాయమూర్తితో గవర్నర్ మరో సారి ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి హజరయ్యారు.