ఎవరు ఈ కల్కి భగవాన్

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)

కల్కి భగవాన్ ఆశ్రమాల్లో ఐటి అధికారులు నిర్వహించిన సోదాల్లో 400 కోట్ల రూపాయల పైగా విలువైన అపార సంపద బయటపడటంతో అందరి దృష్టీ కల్కి భగవాన్‌పై పడింది. అవరీ కల్కి భగవాన్. కల్కి భగవాన్ అసలు పేరు విజయకుమార్ నాయుడు. తమిళనాడు రాష్ట్రం వెల్లూరు జిల్లా గుడియట్టాంలో 1949 మార్చి ఏడున జన్మించాడు. ఆయన తల్లిదండ్రులు వరదరాజులు, వైదర్బి అమ్మ.

విజయకుమార్ రెండు దశాబ్దాల క్రితం ఒక ఇన్సూరెన్స్ ‌కంపెనీలో సాధారణ క్లర్క్‌గా జీవనం ప్రారంభించాడు. ఆ తరువాత ఆ ఉద్యోగాన్ని వదిలివేసి జీవాశ్రమం పేరుతో చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పంలో ఒక కాన్వెంట్ ‌స్కూల్ ప్రారంభించాడు. స్కూల్ అంతగా సాగకపోవడంతో కొంత కాలం విజయకుమార్ ఎవరికీ కనిపించకుండా పోయాడు. కొన్ని సంవత్సరాల తర్వాత తాను దైవాంశ సంభూతుడిగా, విష్ణుమూర్తి అఖరి అవతారం కల్కి భగవానుడిగా ప్రకటించుకున్నాడు. కల్కి భగవాన్‌గా మారిన విజయకుమార్ చిత్తూరు జిల్లా వరదాయపాలెంలో ఒక  ఆశ్రమాన్ని ప్రారంభించాడు. 1990 ప్రాంతం నుండి తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో చాలా పాపులర్  అయ్యాడు. లక్షలాది మంది ప్రజలు ఆయనకు భక్తులుగా మారారు. పెద్ద మొత్తంలో విరాళాలు ఆశ్రమానికి రావడం, భక్తుల సంఖ్య పెరగడంతో సాధారణ దర్శనానికి అయిదు వేల రూపాయలు, ప్రత్యేక దర్శనానికి 25 వేల వరకూ వసూలు చేయడం ఆరంభించారు.

గతంలోనూ కల్కి ఆశ్రమంపై రకరకాల ఆరోపణలు వచ్చాయి. అక్కడ నివాసం ఉన్న భక్తులు కొందరు తర్వాత బయటకు వచ్చి ఆశ్రమం లోపల భక్తులకు మాదకద్రవ్యాలు ఇచ్చి వాటికి బానిసలుగా తయారు చేస్తున్నారనీ, ఎదురు తిరిగిన వారిని చిత్రహింసలు పెడుతున్నారనీ ఆరోపించారు. ఈ ఆరోపణల ఫలితంగా మీడియా కూడా కల్కి ఆశ్రమంపై దృష్టి కేంద్రీకరించింది. దరిమిలా కల్కి ఆశ్రమ నిర్వాహకులు తామే ఒక న్యూస్ ఛానల్ నడపాలన్న నిర్ణయానికి వచ్చి ఓ ఛానల్ కొనుగోలు చేశారు కూడా.

ఆయన ప్రధాన ఆశ్రమం వరదాయపాలెంలో ఉండగా ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో సుమారు 40 వరకూ ఆశ్రమాలను ఏర్పాటు చేసుకొన్నాడు. ఈ ఆశ్రమాలన్నిటికీ  ప్రధాన కార్యాలయం చెన్నైలో నెలకొల్పారు.  ఐటి శాఖ అధికారుల దాడుల నేపథ్యంలో కల్కి దంపతులు ఆజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఐటి అధికారులు ఆయన ఆశ్రమాల్లో,కుమారుడు కృష్ణ నివాసాల్లో రెండు రోజుల పాటు తనిఖీలు నిర్వహించగా కళ్లు బైర్లు కొలిపే విధంగా పెద్ద ఎత్తున నగలు, నగదు, వజ్రాలు, విదేశీ కరెన్సీ లభించింది. సుమారు 500 కోట్ల రూపాయల ఆదాయానికి పన్ను ఎగవేసినట్లు అధికారులు గుర్తించారు. అక్రమ సొమ్ముతో కల్కి కుటుంబ సభ్యులు అమెరికా, చైనా, యుఎఇ, సింగపూర్‌తో పాటు పలు దేశాల కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినట్లుగా కూడా ఐటి అధికారులు గుర్తించారు. హవాలా, పన్ను ఎగవేత తదితర అక్రమాలకు పాల్పడడం ద్వారా కల్కి భగవాన్ అలియాస్ విజయకుమార్ నాయుడు ఇన్ని ఆస్తులను కూడబెట్టినట్లు ఐటి శాఖ అధికారులు చెబుతున్నారు.