కర్ణాటక ప్రాజెక్టుపై అభిప్రాయాలుకావాలి

హైదరాబాద్, డిసెంబరు27: కర్ణాటక రాష్ర్టం తుంగభద్రపై 40 టిఎంసిల సామర్ధ్యంతో ప్రతిపాదించిన ప్రాజెక్టుపై నదీపరివాహక రాష్ర్టాల అభిప్రాయాలను కోరినట్లు తుంగభద్ర నదీ బోర్డు ఛైర్మన్ రంగారెడ్డి తెలిపారు. గురువారం హైదరాబాద్‌లో ఛైర్మన్ రంగారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన తుంగభద్ర నదీ బోర్డు సమావేశంలో తెలంగాణ, ఏపీ, కర్ణాటక నీటిపారుదల ఇంజినీర్లు, ఇతర సభ్యులు హాజరయ్యారు. బోర్డు ఛైర్మన్ రంగారెడ్డి మాట్లాడుతూ.. మూడు రాష్ర్టాలకు సంబంధించిన అన్ని అంశాలపై చర్చించినట్లు తెలిపారు. తుంగభద్రపై 40 టీఎంసీల సామర్థ్యంతో ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ అభిప్రాయాలు అడిగామన్నారు.ఆర్డీఎస్, తుంగభద్ర కుడికాలువ లోలెవల్ కాల్వ ఆధునీకరణపై కూడా సమావేశంలో చర్చించామని చెప్పారు. ఆధునీకరణ పూర్తయ్యాక ఆర్డీఎస్‌ను బోర్డు పరిధిలోకి తీసుకుంటామన్నారు. కర్నాటక ప్రతిపాదనలపై ప్రభుత్వ స్థాయిలోనూ చర్చించాలన్నారు.