కాపీ కొట్టకుండా విద్యార్థుల తలకి బాక్సులు!

బెంగళూరు: పరీక్షల్లో కాపీ కొట్టకుండా ఉండేందుకు విద్యార్థుల త‌ల‌కు కార్డ్‌బోర్డ్ బాక్సులు పెట్టడం వివాదాస్ప‌ద‌మైంది. కర్నాటక రాష్ట్రం హ‌వేరీలోని భ‌గ‌త్ ప్రీ యూనివ‌ర్సిటీ కాలేజీలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. చీటింగ్ కొట్టకుండా ఉండేందుకు పరీక్షకు హాజరైన విద్యార్థుల తలలకు అట్టపెట్టలు తగిలించి పరీక్షలు రాయించారు. అయితే కళ్ల భాగం వరకే తెరిచి ఉండేలా రంద్రాలు పెట్టడంతో కొంతమందికి ఊపిరాడక ఇబ్బందులు పడ్డారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. కాలేజీ యాజ‌మాన్యం తీరు ప‌ట్ల విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో విద్యాశాఖ అధికారులు స్పందించారు. ఈ ఘ‌ట‌న ప‌ట్ల వివ‌ర‌ణ ఇవ్వాల‌ని సదరు కాలేజీకి విద్యాశాఖ నోటీసులు కూడా జారీ చేసింది.

అయితే, కాలేజీ యాజమాన్యం మాత్రం విచిత్రంగా స్పందించింది. ఇలా విద్యార్థుల తలలకు బాక్సులు పెట్టడం ద్వారా కాపీ కొట్టడం ఆగడంతో పాటు వారి మేధో శక్తి పెరుగుతుందని పేర్కొంది. గతంలో బీహార్ లోని ఓ కాలేజీ కూడా పరీక్షల సమయంలో కాపీ కొట్టకుండా ఉండేందుకు ఇలాంటి పద్ధతిని ఉపయోగించిందని, అప్పుడు సోషల్ మీడియాలో దీనిపై ప్రశంసలు కూడా వచ్చాయని  భ‌గ‌త్ ప్రీ యూనివ‌ర్సిటీ కాలేజీ హెడ్ ఎంబీ సతీష్ చెప్పారు. విద్యార్థుల శ్రేయస్సు కోసమే తాము ఈ విధంగా ప్రయత్నించామని తెలిపారు. అయితే తమ ప్రయోగానికి సానుకూల, ప్రతికూల అభిప్రాయాలు వచ్చాయని చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా కాపీ కొట్టకూడదంటే ఇంత దారుణంగా వ్యవహరించాలా? అనే విమర్శలు వినిపిస్తున్నాయి.

మరోవైపు ఈ ఉదంతం అంతా కర్ణాటక రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఎస్. సురేష్ వరకు చేరడంతో.. దీనిపై అయన స్పందిస్తూ కాలేజీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ‘ఇలాంటి చర్యలు ఆమోదయోగ్యం కాదని.. విద్యార్థులను జంతువుల మాదిరిగా చూస్తున్నారని మండిపడ్డారు.