తెలంగాణ ఆర్టీసీ ఇక ప్రైవేట్ పరం?

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

తెలంగాణలో ఆర్టీసీ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఆర్టీసీ ప్రైవేట్ పరం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ తాజా నిర్ణయం ఇందుకు బలం చేకూరుస్తోంది. మూలిగే నక్కపై తాటిపండు పడినట్టు.. దినదిన గండంగా నెట్టుకొస్తున్న ఆర్టీసీలో కార్మికుల సమ్మెతో పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయిన పరిస్థితి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ కార్మికులు చేస్తున్న సమ్మెపై సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీలో ఉన్న దాదాపు 50 వేల మంది కార్మికులను తొలగించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదన్న కేసీఆర్.. ఇకపై ఆర్టీసీ- ప్రైవేట్ భాగస్వామ్యంతో బస్సులు నడుస్తాయని తెలిపారు. ఆర్టీసీ నడిపే బస్సుల్లో సగం ప్రైవేట్ బస్సులు ఉంటాయని స్పష్టం చేశారు. ఆర్టీసీ జేఏసీతో చర్చలు కూడా ఉండవని, బ్లాక్ మెయిల్ చేస్తే ప్రభుత్వం తలవంచదని తేల్చి చెప్పారు. విధులకు హాజరుకాని ఉద్యోగులపై వేటు వేయాలని నిర్ణయించారు. ఆర్టీసీలో మిగిలింది కేవలం 1200 మంది ఉద్యోగులేనని, కొన్ని రోజుల్లోనే కొత్త సిబ్బందిని నియమిస్తామని ప్రకటించారు. కొత్తగా చేరే ఉద్యోగులు యూనియన్ లో చేరబోమని సంతకం చేయాలని కండిషన్ కూడా పెట్టారు.

నిజానికి కార్మికులు సమ్మె చేస్తే సంస్థను ఖచ్చితంగా మూసివేసి ప్రైవేటు పరం చేస్తామని గతంలోనే కేసీఆర్ హెచ్చరించారు. ప్రస్తుతం తెలంగాణ ఆర్టీసీ దాదాపు ఐదు వేల కోట్ల అప్పుల్లో ఉంది. దసరా, బతుకమ్మ పండుగల సందర్భంగా వచ్చే ఆదాయం ఎంతో కొంత ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావించింది. ఈ సమయంలోనే ఆర్టీసీకి నష్టం తెచ్చే విధంగా యూనియన్లు సమ్మెకు దిగడంతో ప్రభుత్వం సీరియస్ అయ్యింది. నాలుగేళ్ల క్రితం ఆర్టీసీ సిబ్బందికి అనూహ్యంగా 44 శాతం ఫిట్‌మెంట్‌ను సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. దీంతో ఒకేసారి ఆర్టీసీపై దాదాపు 850 కోట్ల వార్షిక భారం పడటం.. దానికి సరిపడా ప్రత్యామ్నాయ ఆదాయ మార్గం లేకపోవడంతో క్రమంగా ఆర్టీసీ కుదేలవుతూ వచ్చింది. ఇప్పుడు వేతనాలు కూడా చెల్లించలేని దుస్థితిలో ఉంది టీఎస్‌ ఆర్టీసీ.  దీనికి తోడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో .. ఇప్పుడు తెలంగాణలోనూ ప్రభుత్వం విలీనం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఆర్టీసీ విలీనం అన్నది వైఎస్ జగన్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ.. తెలంగాణలో మాత్రం ఇలాంటి హామీని కేసీఆర్ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదని తేల్చేశారు.

అయితే, ఆర్టీసీని నష్టాల ఊబిలోకి నెట్టి ప్రైవేటుపరం చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నిందని విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఉద్యమ సమయంలో ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను కేసీఆర్ నెరవేర్చాలని డిమాండ్ చేస్తునున్నాయి. మరోవైపు సీఎం కేసీఆర్ నిర్ణయంపై ఆర్టీసీ జేఏసీ నేతలు భగ్గుమన్నారు. ప్రభుత్వం కావాలనే ఆర్టీసీని సమ్మెలోకి నెట్టిందని, ఆర్టీసీ ఆస్తులను దోచుకోవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని జేఏసీ అధ్యక్షుడు అశ్వత్థామరెడ్డి ఆరోపించారు. ఆర్టీసీని మూసివేసేందుకు సర్కారు కుట్రలకు పాల్పడుతోందని, విమానాలపై ఉన్న శ్రద్ధ ఆర్టీసీపై లేదా? అంటూ ప్రశ్నించారు.

ఓ పక్క నష్టాలు పెరిగి మోయలేని భారంగా మారిపోతుంటే మరోవైపు ప్రభుత్వ సహకారం అంతంత మాత్రంగానే ఉంది. దీంతో ఆర్టీసీ యాజమాన్యం దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటోంది. కనుచూపు మేరలో కూడా లాభాలు అర్జించే అవకాశం కనిపించడం లేదు. ఈ దిశగా చేసిన అనేక ప్రయోగాలు విఫలమయ్యాయి. ఆర్టీసీ విలీనం డిమాండ్‌ను ప్రభుత్వం అంగీకరించే పరిస్థితి లేదు. ఇప్పటికిప్పుడు ఆర్టీసీ నష్టాల నుంచి బయటపడే అవకాశం లేదు. దీనికితోడు కార్మికులు సమ్మె బాటతో నష్టాలు మరింత పెరగడంతో పాటు ఆర్టీసీ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ ప్రైవేట్ పరం అయ్యే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ మేరకు కేసీఆర్ సంకేతాలు కూడా ఇచ్చారు.

ఆర్టీసీ చరిత్రలో నూతన అధ్యాయాన్ని ప్రారంభిస్తామని కేసీఆర్ తెలిపారు. ఆర్టీసీని లాభాల్లోకి తీసుకెళ్లేందుకు, సంస్థ మనుగడకు కొన్ని చర్యలు తప్పవన్నారు. ప్రయివేట్ బస్సులను స్టేజ్ క్యారేజ్‌గా చేస్తే వాళ్లు కూడా ఆర్టీసీలోకి వస్తారని సీఎం తెలిపారు. ఆర్టీసీ నడపబోయే బస్సుల్లో సగం ప్రయివేట్ బస్సులుంటాయని, మిగతా సగం ఆర్టీసీ యాజమాన్యానివని నిర్ణయించారు. రెండు మూడేళ్లలో సంస్థ నష్టాలను పూడ్చుకుని లాభాల్లోకి వస్తుందని సీఎం ధీమా వ్యక్తం చేశారు. అనేక రంగాలలో ముందున్న తెలంగాణ రాష్ట్రం ఆర్టీసీ విషయంలో కూడా ముందుండాలి అన్నది కేసీఆర్ లక్ష్యం.