ఎపి మీడియాలో కెసిఆర్ ఫొటో ఎందుకున్నది?

నూతన సంవత్సరం మొదటిరోజు ఉదయం ఏ తెలుగు దినపత్రిక చూసినా తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్రం పలకరించింది. విద్యుత్ రంగంలో తెలంగాణ చారిత్రక విజయం అంటూ కెటిపిఎస్ ఏడవ దశ ప్రారంభం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం అన్ని తెలుగు, ఇంగ్లీష్ దినపత్రికలలో జాకెట్ యాడ్ జారీ చేసింది. మొదటి పేజీ మొత్తం  వార్తలు ఏమీ లేకుండా  ప్రకటన ముద్రిస్తే దానిని జాకెట్ యాడ్ అంటారు.

ఇందులో ఏముంది విశేషం అనుకుంటున్నారా! విశేషం ఏమంటే ఈ ప్రకటన తెలంగాణలో  మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్‌లో కూడా వచ్చింది. ఖజానాకు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చయ్యే ఈ ప్రకటన అసలు ఇవ్వాలా అన్న చర్చను పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్‌లో కూడా అది ఎందుకు కనబడాలన్న ప్రశ్న తలెత్తుతుంది. అవసరం ఉన్నా లేకపోయినా అన్ని రాష్ట్ర  ప్రభుత్వాలూ, కేంద్ర ప్రభుత్వం పత్రికలకూ న్యూస్ ఛానళ్లకూ ప్రకటనలు ఇస్తూనే ఉన్నాయి. అనుకూలంగా వ్యవహరించని మీడియా సంస్థలను దారికి తెచ్చేందుకు ప్రకటనల నిలిపివేతను ఒక ఆయుధంగా వాడటం కూడా కద్దు.

ఇక ఈ ప్రకటన విషయానికి వస్తే, తన ప్రభుత్వం విద్యుత్ రంగంలో సాధించిన విజయాల గురించి ఆంధ్రప్రదేశ్‌లోని తెలుగు ప్రజలు కూడా తెలుసుకోవాలని కెసిఆర్ నిర్ణయించారు. అందుకే రెండు తెలుగు రాష్ట్రలలోనూ ఈ ప్రకటన జారీ చేశారు. ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారన్నది ఆసక్తికరమైవ ప్రశ్న.

ఇక్కడ మొన్న కెసిఆర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును తీవ్రంగా విమర్శిస్తూ అన్న మాటలు గుర్తుకు రాక మానవు. దానికి అంతే దీటుగా చంద్రబాబు సమాధానం ఇచ్చారు. ఒకరి దీక్షాదక్షతలను ఒకరు విమర్శించుకున్నారు. ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్యా ఇంత తీవ్రమైన స్పర్ధ ఉంది కాబట్టి తన హాయాంలో ఆంధ్రప్రదేశ్ కన్నా తెలంగాణలోనే విద్యుత్ సరఫరా పరిస్థితి బావుందని చెప్పుకోవడం కెసిఆర్ ఉద్దేశం కావచ్చు.

నిజానికి ఉమ్మడి రాష్ట్రం రెండుగా విడిపోతున్న సందర్భంలో విద్యుత్తు వ్యవహారమే అత్యంత వివాదాస్పదమైన అంశంగా మారింది. తెలంగాణ విద్యుత్ కొరతను ఎదుర్కొంటుందని చాలామంది అంచనా వేశారు. ఆ అంచనాలు తల్లకిందులవుతూ తెలంగాణలో వ్యవసాయానికి 24 గంటలు విద్యుత్ ఇవ్వగలిగారు. ఈ పూర్వరంగం దృష్ట్యా కెసిఆర్ తన విజయాలను ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా తెలుసుకోవాలని అనుకుంటే అందులో విచిత్రం ఏముంది?