కేసీఆర్‌కు నవీన్ పట్నాయక్ షాక్

భువనేశ్వర్‌లో మీడియాతో కేసీఆర్, నవీన్ పట్నాయక్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం భువనేశ్వర్‌లో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తో  భేటీ అయ్యారు. విశాఖలో స్వరూపానందేంద్ర సరస్వతిని కలుసుకుని శారదాపీఠంలో రాజశ్యామల దేవీపూజలు పూర్తయ్యాక కేసీఆర్ ప్రత్యేక విమానంలో భువనేశ్వర్ బయలుదేరి వెళ్లారు. ఫెడరల్ ఫ్రంట్‌కు మద్దతు కూడగట్టేందుకు కేసీఆర్ పలువురు విపక్ష నేతలను కలుస్తున్న క్రమంలో ఆయన నవీన్ పట్నాయక్‌తో సమావేశమయ్యారు. ఈ భేటీలో తెలంగాణలో అమలు చేస్తున్న రైతుబంధు వంటి వివిధ సంక్షేమ పథకాల గురించి నవీన్ పట్నాయక్‌కు కేసీఆర్ వివరించారు. వాటిని దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పడాలని ఆయన సూచించారు. అలాగే లోక్‌సభ, అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాల్సిన అవసరం ఉందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు.

ఫెడరల్ ఫ్రంట్ మీద మరింత విస్తృతంగా జరగాలని నవీన్ పట్నాయక్ కేసీఆర్‌తో అన్నట్లు తెలిసింది. కాగా, 2019 ఎన్నికల్లో ఫెడరల్ ఫ్రంట్ కలిసి సాగుతారా అన్న మీడియా ప్రశ్నకు తానింకా ఆలోచించుకోలేదని నవీన్ పట్నాయక్ బదులిచ్చారు. మరోవైపు, దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాల్సిన అవసరం ఉందని తెలంగాణ కేసీఆర్ పేర్కొన్నారు. ఫెడరల్ ఫ్రంట్ అనేది చాలా విస్తృతమైన అంశమనీ, త్వరలోనే దీనికి సంబంధించిన ఫలితాలను చూస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పలువురు నేతలతో ఇంకా ఫ్రంట్‌పై చర్చించాల్సి ఉందనీ, మరోసారి వచ్చి నవీన్ పట్నాయక్‌ను కలుస్తాననీ కేసీఆర్ చెప్పారు.

నవీన్ నుండి క్లారిటీ రాకపోవడంతో కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ మిషన్ ఊపందుకునే సూచనలు కనిపించడం లేదు. ఆయన కోల్‌కతా వెళ్లి మమతా బెనర్జీని కూడా కలుసుకోనున్నారు. మాయావతి, అఖిలేశ్ యాదవ్ వంటి పలువురు విపక్ష ప్రముఖులనూ ఆయన రాగల రెండు మూడు రోజుల్లో కలుసుకుంటారు. అయితే వారిలో చాలా మంది ఇప్పటికే కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష కూటమికి మద్దతు ప్రకటించి ఉన్నందున కేసీఆర్ ప్రయత్నాలు ఏ మేరకు సఫలమౌతాయో ప్రశ్నార్థకంగానే ఉంది. మర్యాదపూర్వకంగా కలుసుకోవడమే తప్ప ఇతర విపక్ష నేతలెవరూ కేసీఆర్ ఫ్రంట్‌ పట్ల ఆట్టే ఆసక్తి చూపుతున్నట్లు కనిపించడం లేదు. కేసీఆర్ నిజానికి ప్రధాని మోదీ మనిషి అంటూ ప్రచారం సాగడం కూడా ఇందుకు ఒక కారణం కావచ్చు. కేసీఆర్‌ను విపక్ష నాయకులెవరూ సీరియస్‌గా తీసుకుంటున్నట్లు లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.