ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్ ఫెడర్‌ఫ్రంట్‌ ఏర్పాటు దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా  కేసీఆర్ తన కుటుంబ సభ్యులతో కలసి ఆదివారం విశాఖ చేరుకున్నారు. విశాఖలో ఆయన శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర అశీస్సులు తీసుకోనున్నారు. అక్కడి రాజశ్యామలాదేవి ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. తెలంగాణ ముదస్తు ఎన్నికల ముందు కూడా ఫాంహౌస్‌లో స్వరూపానందేంద్ర సూచనల మేరకు యాగం నిర్వహించారు. ఏదైనా బృహత్కార్యం తలపెట్టేముందు స్వాముల అశీర్వచనాలు పొందడం కేసీఆర్ కు ఆనవాయితీ.

ఇక ఎన్నికల్లో విజయం తర్వాత ఫెడల్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా సీఎం కేసీఆర్  తనదైన శైలిలో వ్యూహాలను రచిస్తున్నారు. ఈ మేరకు నెలరోజుల పాటు ప్రత్యేక విమానాన్ని సైతం ఆయన అద్దెకు తీసుకున్నారు. స్వామి స్వరూపానందేంద్ర ఆశీర్వచనం అనంతరం కేసీఆర్ ‌ విశాఖ నుంచి భువనేశ్వర్ వెళ్లి  ఒడిశా  సీఎం నవీన్ పట్నాయక్‌తో భేటీ కానున్నారు. కేసీఆర్ తన పర్యటనలో భాగంగా కోల్‌కతా, ఢిల్లీల్లోనూ పర్యటించనున్నారు. డిసెంబర్ 25 నుండి 28 వరకు మూడు రోజుల పాటు కేసీఆర్ ఢిల్లీలో ఉండే అవవాశం  ఉంది. మాయావతి, అఖిలేశ్‌లను కూడా ఆయన కలవనున్నారు. 26 సాయంత్రం 4 గంటలకు ప్రధానితొ మర్యాద పూర్వకంగా భేటీ కానున్నారు. అదేరోజు సాయంత్రం ఎన్నికల కమిషనర్‌తో కూడా ఆయన సమావేశం అవుతారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా నెల రోజుల పాటు కేసీఆర్ వివిధ రాష్ట్రాలలో పర్యటించనున్నారు.