కేరళలో తొలి ట్రాన్స్‌జెండర్ పైలట్‌‌!

తిరువనంతపురం: పైలట్ కావాలని కలగన్న ఓ ట్రాన్స్‌జెండర్‌‌కు కేరళ ప్రభుత్వం అండగా నిలిచింది. అతడి శిక్షణకు కావాల్సిన ఆర్థిక సాయం అందించేందుకు ముందుకొచ్చింది. 20 ఏళ్ల ఆడమ్ హారీ.. పైలట్ కావాలనే తన లక్ష్యాన్ని కుటుంబ సభ్యులతో చెప్పాడు. అయితే, వారు హరీకి సహకరించపోగా.. నిరుత్సాహపరిచారు. దీంతో హారీ ప్రభుత్వాధికారులను ఆశ్రయించాడు. సాయం చేస్తే దేశంలోనే తొలి ట్రాన్స్‌జెండర్ పైలట్‌ అవుతానని వివరించాడు. హరీ ఆసక్తిని గుర్తించిన ఉన్నతాధికారులకు పైలట్ శిక్షణకు అయ్యే ఖర్చు మొత్తం భరిస్తామని భరోసా ఇచ్చారు.

దీనిపై హరీ మాట్లాడుతూ..’పైలట్‌ కావాలన్న నా కోరికను ఇంట్లో చెప్పినప్పుడు మా తల్లిదండ్రులు కాదన్నారు. నన్ను భౌతికంగా, మానసికంగా హింసించారు. దాన్ని తట్టుకోలేక నేను ఇంట్లో నుంచి ఎర్నాకుళం పారిపోయాను. అదృష్టవశాత్తూ అక్కడ మరో ట్రాన్స్‌జెండర్‌ నాకు పరిచయమై, నా ఆసక్తిని గమనించారు. అధికారులతో చెప్పి నాకు ఆర్థిక సాయం వచ్చేలా చేశారు. సౌతాఫ్రికాలోని జొహసెన్‌బర్గ్‌లో ప్రైవేట్‌ పైలట్‌ ట్రైనింగ్‌ తీసుకున్నాను. ఏడాది శిక్షణ తరువాత భారత్‌కు చేరుకున్నాను. ఇప్పుడు నాకు కమర్షియల్‌ పైలట్‌ కావాలని ఉండటంతో అధికారులను ఆశ్రయించాను. అధికారులు కావాల్సిన సహాయం చేస్తామని భరోసా ఇచ్చారు’ అని తెలిపారు.

ఆడమ్ హారీ తన శారీరక పరిస్థితి విషయంలో ఎదురైన చిత్రహింసలు, వేధింపులను దీటుగా ఎదిరించి రెండేళ్ల క్రితం ప్రైవేట్‌ పైలట్‌ లైసెన్స్‌ను సాధించుకుని దేశంలోనే తొలి ట్రాన్స్‌జెండర్‌ పైలట్‌గా రికార్డులకెక్కాడు. ప్రస్తుతం 20 ఏళ్ల వయస్సులో వున్న హారీ.. కమర్షియల్ పైలట్‌ కావాలన్న లక్ష్యాన్ని సాధించేందుకు సహకరించిన కేరళ ప్రభుత్వ సామాజిక న్యాయ విభాగానికి హారీ కృతజ్ఞతలు తెలియచేశాడు. ఇక్కడి రాజీవ్‌గాంధీ అకాడమీ ఫర్‌ ఏవియేషన్‌ టెక్నాలజీ, ఆర్‌పిటి టెక్నాలజీ సంస్థల్లో మూడేళ్ల విద్యాభ్యాసాన్ని శిక్షణను పూర్తి చేసిన తరువాత తనకు కమర్షియల్ పైలట్‌ లైసెన్స్‌ లభిస్తుందని హారీ వివరించారు.