నిర్దాక్షిణ్యంగా ఏసేయండి! : సీఎం కుమార స్వామి

బెంగళూరు, డిసెంబర్ 25  : కర్నాటక సీఎం హెడ్ డి కుమార స్వామి ఒక ఫోన్ సంభాషణ రికార్డింగ్‌లో అడ్డంగా దొరికిపోయారు. జేడీఎస్ కార్యకర్త ఒకరి హత్యకు సంబంధించిన వ్యవహారంలో ప్రతీకారం తీర్చుకోవాలంటూ కుమార స్వామి వ్యాఖ్యానించడం దుమారం రేపింది. కుమార స్వామి పగ-ప్రతీకారం ధోరణిలో ఒక పోలీసు ఉన్నతాధికారితో మాట్లాడడం వీడియోలో రికార్డు అయింది. నిర్దాక్షిణ్యంగా వాళ్లని (హంతకులు) షూట్ చేసి చంపేయండి, ఏ సమస్యా లేకుండా నేను చూసుకుంటా..అని కర్నాటక సీఎం అన్నారు. దీని పూర్వాపరాలు ఇలా ఉన్నాయి.

otfi963c
హత్యకు గురైన ప్రకాశ్ (ఫైల్ ఫోటో)

సౌత్ కర్నాటకలో జేడీఎస్ నేత హెచ్ ప్రకాశ్ (50) సోమవారం సాయంత్రం 4.30 గంటలకు దారుణ హత్యకు గురి అయ్యారు. నలుగురు వ్యక్తులు మోటార్ సైకిళ్లపై ప్రకాశ్ వాహనాన్ని(ఎస్‌యువీ) వెంబడించి అడ్డుకున్నారు. ఆపై వేట కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడి  నెత్తుటి మడుగులో పడి ఉన్న ప్రకాశ్‌ను ఆ తర్వాత  మాండ్యా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రికి తరలించారు. ఆయన అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. దీనిపై ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. “ప్రకాశ్ పార్టీకి విధేయుడైన మంచి కార్యకర్త. అతడిని హత్య చేసినవారిని అరెస్టు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా పోలీసు యంత్రాంగాన్ని ఆదేశంచడం జరిగింది” అని ఆ ప్రకటన పేర్కొంది.

ఈ హత్యను సీరియస్‌గా తీసుకున్న కుమార స్వామి ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. “ప్రకాశ్ మంచి మనిషి. అతడిని ఇలా దారుణంగా హతమార్చిందెవరో తెలియదు. కానీ వాళ్లని వదలొద్దు. షూట్ చేసి ఆ హంతకులని నిర్దాక్షిణ్యంగా చంపేయండి. ఏ సమస్యా ఉండదు. నేను చూసుకుంటాను…” అంటూ  కుమార స్వామి అన్న మాటలను స్థానిక జర్నలిస్టులు కొందరు రికార్డు చేశారు. కుమార స్వామి మాట్లాడిన అవతలి వ్యక్తి బహుశా పోలీసు ఉన్నతాధికారి అయి వుంటారని భావిస్తున్నారు. ఈ మాటలు రికార్డు అయిన వీడియో క్లిప్ మీడియాలో వైరల్ కావడంతో సీఎం వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించారు. నిజానికి తాను అలాంటి ఆదేశాలేవీ ఇవ్వలేదనీ, అదంతా కేవలం “ఎమోషన్‌”లో అన్న మాటలేననీ కుమార స్వామి చెప్పారు.

ప్రకాశ్‌ను చంపినవాళ్లు లోగడ రెండు హత్యలు చేశారు. వారిన్నాళ్లూ జైల్లో ఉన్నారు. ఇప్పుడు రెండు రోజుల కిందట బెయిల్‌పై బయటకు వచ్చి మరో హత్యకు పాల్పడ్డారు. బెయిల్‌ను వాళ్లు ఎలా మిస్ యూజ్ చేస్తున్నారో చూడండి…అని కుమార స్వామి వ్యాఖ్యానించారు.

కుమార స్వామి అలా నిందితులను కాల్చి చంపేయమంటూ ఆదేశాలివ్వడం బాధ్యతారాహిత్యమని కర్నాటక బీజేపీ నేత యడ్యూరప్ప విమర్శించారు. కాగా, వ్యక్తిగత కక్షలే ప్రకాశ్ హత్యకు దారితీశాయని మద్దూరు పోలీస్ స్టేషన్ ఎస్ ఐ కుమార మీడియాకు చెప్పారు.

కుమార స్వామి వివాదాస్పద వ్యాఖ్యల వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.